అయితే చాలామంది ఇంట్లో చేసేటప్పుడు చేప ముక్క నీచు వాసన రావడం లేదా నూనెలో వేయించేటప్పుడు పైపొర ఊడిపోయి విరిగిపోవడం జరుగుతుంటుందని తెలుపుతున్నారు. అలా కాకుండా ముక్క పైకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఉంటూ, లోపల జ్యూసీగా పక్కా కేఫ్ స్థాయి రుచితో రావడానికి పాటించాల్సిన ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
బోన్లెస్ చేప ముక్కలు: అర కిలో (పొడవాటి వేళ్ల ఆకారంలో కోసినవి),
నిమ్మరసం: 1 పెద్ద చెంచా,
అల్లం వెల్లుల్లి ముద్ద: 1 పెద్ద చెంచా,
పసుపు: పావు చిన్న చెంచా,
కారం పొడి: 1 చిన్న చెంచా,
మిరియాల పొడి: అర చిన్న చెంచా,
చాట్ మసాలా: అర చిన్న చెంచా,
గరం మసాలా పొడి: పావు చిన్న చెంచా,
ఉప్పు: రుచికి సరిపడా,
నూనె: వేయించడానికి సరిపడా,
కోటింగ్ కోసం:
మైదా పిండి: పావు కప్పు
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్): పావు కప్పు
కోడిగుడ్లు: 2 (చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసి గిలక్కొట్టినవి)
బ్రెడ్ క్రంబ్స్ (బ్రెడ్ పొడి): 1 కప్పు
ముల్లు లేని చేప ముక్కలను శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా టిష్యూ పేపర్తో తుడిచి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం పొడి, మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి కలపండి. ఈ మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలన్నింటికీ సమానంగా పట్టించి కనీసం 20-30 నిమిషాలు నాననివ్వండి. ఇప్పుడు కోటింగ్ కోసం మూడు వేర్వేరు ప్లేట్లను సిద్ధం చేసుకోండి.
మొదటి ప్లేట్లో మైదా పిండి, మొక్కజొన్న పిండి కలిపి ఉంచండి. రెండో గిన్నెలో గిలక్కొట్టిన గుడ్డు మిశ్రమం ఉంచండి. మూడో ప్లేట్లో బ్రెడ్ పొడిని ఉంచండి. మ్యారినేట్ చేసిన చేప ముక్కను తీసుకుని మొదట మైదా-కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో దొర్లించి అదనపు పిండిని దులిపేయండి.
ఆ తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో వేసి ముక్క చుట్టూ బ్రెడ్ పొడి బాగా అంటేలా చేత్తో సున్నితంగా ఒత్తండి (మరింత క్రిస్పీగా రావాలనుకుంటే మరోసారి గుడ్డులో ముంచి మళ్లీ బ్రెడ్ పొడి అద్దవచ్చు). ఇలా అన్ని ముక్కలను సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లో ఉంచి ఫ్రిజ్లో 10 నిమిషాలు ఉంచితే కోటింగ్ గట్టిపడి నూనెలో ఊడిపోకుండా ఉంటుంది. బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయండి.
నూనె వేడయ్యాక సిద్ధం చేసుకున్న ఫిష్ ఫింగర్స్ను ఒక్కొక్కటిగా వేసి, మీడియం మంటపై రెండు వైపులా మంచి బంగారు రంగు వచ్చి కరకరలాడే వరకు వేయించి టిష్యూ పేపర్పైకి తీయండి. ఎంతో రుచికరమైన క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ సిద్ధం. మయోనైస్ లేదా టమోటా సాస్, నిమ్మచెక్కతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.
