Last Updated:
Gold Jewellery: బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారుల ఆలోచనా విధానం మారుతోంది. గతంలో భారీ బరువున్న గొలుసులు, గాజులు కొనేందుకు ఆసక్తి చూపినవారు ఇప్పుడు తక్కువ బరువున్న నగలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా?
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒకానొక సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.2 లక్షలకు చేరువవ్వగా ఈ మధ్య కొంత శాంతించింది. అయినా సరే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో పెళ్లిళ్లు, పంక్షన్స్, పండుగల కోసం బంగారు ఆభరణాలు కొనేవారు ఒకటికి పదిసార్లు ఆలోచించి.. స్వచ్ఛత, డిజైన్, మేకింగ్ ఛార్జీలు, భవిష్యత్తులో ఉపయోగం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో పాటుగా ప్రజల ఆలోచనా విధానం కూడా మారడంతో బంగారం కొనుగోళ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
గతంలో ఎక్కువ బరువున్న గొలుసులు, గాజులు, హారాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన మహిళలు ఇప్పుడు తక్కువ బరువున్న ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ క్యారెట్ల బంగారు నగలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. అంటే బంగారం కొనుగోళ్లను పూర్తిగా ఆపకపోయినా, తమ దగ్గరున్న డబ్బుకు అనుగుణంగా కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకుంటున్నారు. ఈ పరిణామాలపై క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక కీలక అంచనాలను వెల్లడించింది. బంగారం ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం పెరుగుతుండగా, జ్యువెలరీ కంపెనీల వ్యాపారంపై మాత్రం భిన్నమైన ప్రభావం కనిపించనుందని తెలిపింది.
క్రిసిల్ రేటింగ్స్ అంచనా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా బంగారు ఆభరణాల విక్రయాల పరిమాణం 4 నుంచి 6 శాతం తగ్గవచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరలు సగటున 25 నుంచి 27 శాతం అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారులు తక్కువ బరువున్న నగలు కొనుగోలు చేయడం, కొందరు కొనుగోళ్లను వాయిదా వేయడం వల్ల మార్కెట్‌లో విక్రయించే బంగారం పరిమాణం తగ్గనుంది. అయితే ధరలు పెరగడంతో జ్యువెలరీ కంపెనీల ఆదాయం మాత్రం 21 నుంచి 23 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
బంగారం ధర ఎక్కువగా ఉన్నప్పుడు క్వాలిటీ విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉంటారు. అందుకే హాల్‌మార్క్, స్వచ్ఛత ధ్రువీకరణ, పారదర్శకమైన బిల్లింగ్ అందించే బ్రాండెడ్ జ్యువెలరీ షాపులకు జనాలు క్యూ కడుతున్నారు. పెద్ద పెద్ద షాపుల్లో పాత బంగారాన్ని మార్చుకునే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో చిన్న దుకాణాలతో పోలిస్తే పెద్ద సంస్థలు తమ మార్కెట్ వాటాను భారీగా పెంచుకునే అవకాశం ఏర్పడింది.
ఆదాయం పెరిగినంత మాత్రాన జ్యువెలరీ కంపెనీలకు లాభాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని చెప్పలేం. కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు, ప్రకటనలపై ఖర్చు పెరగవచ్చు. గతేడాది పాత స్టాక్ విలువ పెరగడం వల్ల వచ్చిన అదనపు లాభాలు ఈసారి తగ్గే అవకాశం ఉంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో 9.3 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్లు ఈ ఏడాది 8.5 నుంచి 8.7 శాతానికి తగ్గవచ్చని క్రిసిల్ అంచనా వేసింది.
జ్యువెలరీ సంస్థలు కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయడం కొనసాగించినా, గతంతో పోలిస్తే విస్తరణ వేగం తగ్గవచ్చు. గత రెండేళ్లలో ఏటా 12 నుంచి 15 శాతం మేర స్టోర్ల సంఖ్యను పెంచిన కంపెనీలు, రాబోయే రెండేళ్లలో 7 నుంచి 9 శాతానికే పరిమితం కావచ్చని నివేదిక తెలిపింది. మొత్తంగా చూస్తే బంగారం ధరల పెరుగుదల సామాన్యుల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తోంది. ధరలు తగ్గితేనే పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. అప్పటివరకు తక్కువ బరువున్న నగలే వినియోగదారులకు ప్రధాన ఎంపికగా మారనున్నాయి.

