Last Updated:
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణ’. ఈ సినిమాకు పైరసీ ముప్పు లేకుండా ముంబై బాంబే హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). దంగల్ ఫేమ్ నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే చిత్ర బృందానికి భారీ ఊరట లభించింది. ఈ సినిమాకు పైరసీ ముప్పు లేకుండా ముంబై బాంబే హైకోర్టు (Bombay High Court) కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్ పైరసీ నుంచి తమ సినిమాకు రక్షణ కల్పించాలంటూ నిర్మాణ సంస్థల్లో ఒకటైన గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సినిమాను థియేటర్లలో రికార్డు చేయడం, అనధికారికంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం లేదా స్ట్రీమింగ్ చేయడంపై కోర్టు కఠిన నిషేధం విధించింది.
పైరసీ కంటెంట్‌కు సంబంధించిన అనధికారిక లింకులు, మిర్రర్ వెబ్‌సైట్లను వెంటనే గుర్తించి వాటిని తొలగించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు, సామాజిక మాధ్యమ సంస్థలకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పైరసీ కంటెంట్ ఉన్నట్లు ఫిర్యాదు అందిన వెంటనే ఆయా లింకులను బ్లాక్ చేయడం లేదా శాశ్వతంగా తొలగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ మాధవ్ జమ్దార్ తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ చిత్ర యూనిట్ కు అండగా నిలిచింది.
విచారణ సందర్భంగా మేకర్స్ కోర్టుకు విస్తుపోయే వివరాలను వెల్లడించారు. ‘రామాయణ’ సినిమా కేవలం ఒక భాగం కాదు, రెండు భాగాలుగా రాబోతోందని, తొలి భాగానికి ఏకంగా రూ.2 వేల కోట్ల వ్యయం చేసినట్లు తెలిపారు. రెండు భాగాలకు కలిపి మొత్తంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినప్పుడు పైరసీ జరిగితే వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రివ్యూ ప్రదర్శనల సమయంలో ఎన్నో కఠినమైన ఒప్పందాలు, భద్రతా ప్రమాణాలు అమలు చేసినప్పటికీ.. కొందరు ఆకతాయిలు రెండు ట్రైలర్లను రహస్యంగా మొబైల్స్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో లీక్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటనల దృష్ట్యా, సినిమా విడుదలయ్యాక కూడా మళ్లీ భారీ స్థాయిలో పైరసీ జరిగే అవకాశం ఉందని, దాని వల్ల కోలుకోలేని నష్టం జరుగుతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి వంటి భారీ తారాగణంతో విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇంతటి భారీ ప్రాజెక్టుకు పైరసీ ముప్పు పొంచి ఉండటంతో బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు యావత్ సినీ పరిశ్రమకు ఊరటనిచ్చింది.

