Last Updated:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీల ముప్పు సినీ పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అమిత్ షాను కోరారు చిరంజీవి, రామ్ చరణ్.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీల ముప్పు సినీ పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన అమిత్ షాను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన మెగా తండ్రీకొడుకులు, సినీ కళాకారుల భద్రత, గౌరవానికి ముప్పుగా మారిన డీప్‌ఫేక్ సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇటీవల కాలంలో సినీ ప్రముఖులను, ముఖ్యంగా నటీమణులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు సృష్టించడం నెట్టింట తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ సైబర్ వేధింపులపై అప్పట్లోనే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని మరీ ఈ సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ సాంకేతికతను వాడుకుని కొందరు అకతాయిలు సృష్టిస్తున్న నకిలీ కంటెంట్ వల్ల కళాకారుల ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, వారి సృజనాత్మక హక్కులకు భంగం వాటిల్లుతోందని చిరంజీవి వివరించారు. ఈ కీచక పర్వానికి అడ్డుకట్ట వేసేందుకు, ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనిపై అమిత్ షా అత్యంత సానుకూలంగా స్పందించారు. ఏఐ దుర్వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు అత్యవసరంగా పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సమగ్రమైన సమాచారంతో లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని చిరంజీవికి సూచించిన అమిత్ షా.. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అప్పగించారు.
అమిత్ షాతో జరిగిన ఈ కీలక భేటీ వివరాలను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “మా నాన్న చిరంజీవి గారితో కలిసి గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం వల్ల కళాకారులు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించాం. మా ఆందోళనలను అర్థం చేసుకుని, ఆయన సానుకూలంగా స్పందించిన తీరు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. ఈ దుర్వినియోగాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని హామీ ఇవ్వడం సంతోషకరం. మాకు విలువైన సమయం కేటాయించిన అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చరణ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

