Last Updated:
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు కొత్త మలుపు తిరిగింది.
Trainee IPS Uday Krishna Reddy: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు, అకాడమీ విచారణ, తాత్కాలిక సస్పెన్షన్, ఆత్మహత్యాయత్నం, తాజాగా వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌తో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. అనంతరం జాతీయ పోలీస్ అకాడమీ అంతర్గతంగా ఏర్పాటు చేసిన ప్రివిలేజ్ కమిటీ ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన కమిటీ, ఆరోపణలకు ఆధారాలు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అకాడమీ నిర్ణయం తీసుకుంది. సర్వీస్‌లో తుది నిర్ణయం సంబంధిత అధికారుల పరిధిలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ పరిణామాల అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో బంధువుల ఇంట్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అనంతరం ఆయనను ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లు ప్రచారంలో ఉన్న సూసైడ్ నోట్ బయటకు రావడం మరో కీలక పరిణామంగా మారింది. అందులో తన ఆత్మహత్యాయత్నానికి నలుగురు వ్యక్తులు కారణమని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే తనతో కలిసి శిక్షణ పొందుతున్న మహిళా అధికారిణితో గత ఏడాది కాలంగా సంబంధం కొనసాగిందని, ఆమె వివాహం జరిగిన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగిందని రాసినట్లు తెలుస్తోంది. మహిళా అధికారి స్వచ్ఛందంగానే తన గదికి వచ్చేదని, దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయాలను ఆమె భర్తకు కూడా తెలియజేశానని, సంబంధిత ఆధారాలన్నీ తన మొబైల్ ఫోన్‌లో భద్రపరిచినట్లు నోట్‌లో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ సూసైడ్ నోట్
తోటి బ్యాచ్ మెట్ తో ఏడాది నుండి రిలేషన్ లో ఉన్నాను
పెళ్లి తర్వాత కూడా రిలేషన్ లో ఉన్నాం
నా రూమ్ కు వచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్పింది.
నా వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయి
ఇదే విషయాలు వల్ల భర్త కు చెప్ప…
నా రూమ్ లో ఏం జరిగిందో ట్రైనీ ఐపీఎస్… pic.twitter.com/QcCCWDWXOc
— Telangana365 (@Telangana365) July 20, 2026
ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా ఒక స్టోరీ పోస్టు చేశారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తనకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, చివరకు న్యాయమే గెలుస్తుందని అందులో పేర్కొన్నారు.
ఉదయ్ ఆరోగ్య పరిస్థితిపై చికిత్స అందిస్తున్న వైద్యుడు మాట్లాడుతూ.. ఆయన ఏమి తీసుకున్నారన్న విషయంపై రక్త పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని వివరించారు.
మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి కూడా స్పందించారు. తన అన్నపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఉదయ్ ఎలాంటి తప్పూ చేయలేదని, జాతీయ పోలీస్ అకాడమీ ఆయనను సస్పెండ్ చేయలేదని, ఎక్స్‌ట్రా ఆర్డినరీ లీవ్ (EOL) తీసుకుని ఇంటికి వచ్చారని తెలిపారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనలో ఉన్నారని చెప్పారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అని, ఇలాంటి ఆరోపణలు కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంలో అకాడమీ అంతర్గత చర్యలు, పోలీసు దర్యాప్తు, వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లోని అంశాలు అన్నీ దర్యాప్తులో భాగంగా పరిశీలించాల్సి ఉంది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోపణలు, ప్రతిఆరోపణలపై తుది నిజానిజాలు అధికారిక దర్యాప్తు అనంతరం మాత్రమే తేలనున్నాయి.
Hyderabad,Telangana

