రూ.1 కోటి ఎలా అవుతుంది?
నెలకు రూ.12,000 చొప్పున SIPలో పెట్టుబడి పెట్టి, సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని భావిస్తే, సుమారు 20 సంవత్సరాల్లో పెట్టుబడి విలువ రూ.1 కోటికి చేరుకునే అవకాశం ఉందని కిరణ్ గాంధీ తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఏడాది SIP మొత్తాన్ని 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళితే, అదే లక్ష్యాన్ని ఇంకా తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అంటే ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడిని కూడా పెంచడం ద్వారా సంపద సృష్టి వేగవంతమవుతుంది. భారతీయ పెట్టుబడిదారుల్లో SIPలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ నెలలో SIPల ద్వారా వచ్చిన పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ.31,781 కోట్లకు చేరాయి. ఇది మే నెలలో నమోదైన రూ.30,954 కోట్లతో పోలిస్తే 2.7 శాతం ఎక్కువ. అలాగే గత ఏడాది జూన్‌లో నమోదైన రూ.27,269 కోట్లతో పోలిస్తే 16.5 శాతం వృద్ధి నమోదైంది. దీన్ని బట్టి దీర్ఘకాలిక పెట్టుబడులపై చిన్న పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరుగుతోందని అర్థమవుతోంది.

