ఏడేళ్ల క్రితమే పేదల బీమా కోసం గళమెత్తిన జర్నలిస్టు దొడ్డా ప్రభుదాస్
2018, 2019లోనే ఫేస్‌బుక్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి.. నాటి ఆలోచనలకు నేడు అమలు రూపం దక్కడంపై హర్షం
ప్రభ న్యూస్ , భద్రాచలం , చర్ల:
పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితమే పేదల బీమా అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన సీనియర్ జర్నలిస్టు దొడ్డా ప్రభుదాస్ ప్రయత్నం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2018, 2019 సంవత్సరాల్లోనే సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా పేదలకు బీమా సదుపాయం కల్పించాలని ఆయన చేసిన విజ్ఞప్తులు ప్రస్తుతం అమలవుతున్న నేపథ్యంలో ఆయన హర్షం వ్యక్తం చేశారు.2018 అక్టోబర్ 17న, 2019 జూన్ 14న తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పేద కుటుంబాలకు బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఆయన పోస్టులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలందరికీ బీమా భద్రత కల్పించాలని, ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తన పోస్టులను విస్తృతంగా షేర్ చేయాలని అప్పట్లో విజ్ఞప్తి చేశారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు బీమా భరోసా ఎంతో అవసరమని, కుటుంబ పెద్దను కోల్పోయినా లేదా ఇతర అనుకోని పరిస్థితులు ఎదురైనా ఆ కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా ప్రభుత్వం అండగా నిలవాలన్నదే తన ప్రధాన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏడేళ్ల క్రితమే పేదల బీమా అవసరాన్ని గుర్తించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, ఆ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించడం తనకు సంతృప్తినిస్తోందని తెలిపారు.
ప్రజా సమస్యలపై ముందుగానే స్పందిస్తూ, పేదల సంక్షేమం కోసం తన వంతు ప్రయత్నం చేసిన సీనియర్ జర్నలిస్టు దొడ్డా ప్రభుదాస్ పాత పోస్టులు ప్రస్తుతం మరోసారి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

