Last Updated:
Tiger Shroff: బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముంబైలోని జుహు ప్రాంతంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటన అనంతరం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ఆదివారం టైగర్ ష్రాఫ్ నివాసానికి వెళ్లి ఆయన్ను, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ దాడి ఘటన తర్వాత టైగర్ ష్రాఫ్‌కు సంబంధించిన తొలి చిత్రాలు బయటకు వచ్చాయి. అందులో ‘భాగీ’ నటుడి చేతికి బ్యాండేజ్, భుజం మరియు ఛాతీ భాగాల్లో డ్రెస్సింగ్ వేసి ఉండటం కనిపించింది.
నటుడితో భేటీ అనంతరం శిందే మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు వెల్లడించారు. గన్‌పౌడర్, పగిలిన గాజు పెంకుల వల్ల టైగర్ ష్రాఫ్ గాయపడ్డారని తెలిపారు. “ఇది చాలా తీవ్రమైన ఘటన. నిందితులు సుమారు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ టైగర్ ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన డ్రైవర్ ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను నటుడిని స్వయంగా కలిసి మాట్లాడాను. గన్‌పౌడర్, గాజు పెంకులు గుచ్చుకోవడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. ఈ పరిణామంతో టైగర్, ఆయన తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు” అని శిందే పేర్కొన్నారు.
ముంబై నగరంలో ఇలాంటి గ్యాంగ్ వార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, కాల్పుల వెనుక ఉన్న నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “ప్రజా ప్రముఖులకు బహిరంగంగా ఇలాంటి బెదిరింపులు వస్తున్న తరుణంలో ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చాను. ఎలాంటి బెదిరింపులను ఉపేక్షించబోం. 1990ల కాలంలో ఇలాంటి గ్యాంగ్ వార్లు సాధారణంగా ఉండేవి. కానీ 1995 నాటికే ముంబై పోలీసులు వాటికి పూర్తిగా చరమగీతం పాడారు. ప్రజలను, ప్రముఖులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఈ రౌడీయిజానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం” అని శిందే హెచ్చరించారు.
#WATCH | Mumbai | Firing incident involving actor Tiger Shroff | Maharashtra Dy CM Eknath Shinde says, “This is a major incident… five rounds were fired, but fortunately, he was safe. His driver sustained injuries, and the incident is condemnable. I met with the actor; he has injuries on his left hand caused by gunpowder and shards of glass. Both he and his mother are quite shaken… I have assured them that the state government stands with them in the face of the open threats being directed at public figures… No form of threat will be tolerated. Such gang wars were quite common in the 90s, but the Mumbai Police put an end to them in 1995… These attempts to intimidate people will not be tolerated, and we will put an end to this hooliganism…”
— ANI (@ANI) October 18, 2026
ఆదివారం సాయంత్రం జుహులోని ఓ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి టైగర్ ష్రాఫ్ బయటకు వస్తుండగా ఆయన వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్ కారు డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న ఒక ఆటోరిక్షా డ్రైవర్ కూడా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై ముంబై పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

