Last Updated:
దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 2027 జనవరి 1 అర్హత తేదీగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది.
దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్ఆర్) చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 21 ప్రకారం ఈ సవరణ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హత తేదీగా నిర్ణయించింది. అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన పౌరులందరినీ ఓటరు జాబితాలో చేర్చడం, తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తు చేపడుతున్నారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన కాలపట్టిక ప్రకారం, నవంబర్ 2 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. అనంతరం నవంబర్ 12న సమీకృత ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి డిసెంబర్ 11 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలు, క్లెయిమ్‌లను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 28 నాటికి ఈ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి, వచ్చే ఏడాది జనవరి 4న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
The Election Commission of India (ECI) has directed 17 States and Union Territories to conduct a Special Summary Revision (SSR) of electoral rolls under Section 21 of the Representation of the People Act, 1950, with January 1, 2027, as the qualifying date.
The revision will cover Andaman and Nicobar Islands, Assam, Bihar, Chhattisgarh, Goa, Gujarat, Kerala, Lakshadweep, Madhya Pradesh, Manipur, Puducherry, Punjab, Rajasthan, Tamil Nadu, Uttar Pradesh, Uttarakhand, and West Bengal.The Commission stated that the schedule for SSR in States and UTs where the Special Intensive Revision (SIR) is ongoing or has recently been completed will be announced later.
— ANI (@ANI) October 15, 2026
ప్రస్తుతం సమగ్ర ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) జరుగుతున్న లేదా ఇటీవలే పూర్తయిన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, ఒడిశా వంటి ప్రాంతాలను ప్రస్తుత జాబితాలో చేర్చలేదు. ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక షెడ్యూల్‌ను కమిషన్ త్వరలోనే విడుదల చేయనుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలకు వేరేగా ప్రకటన వెలువరిస్తారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన పౌరులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

