Last Updated:
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం ఆయన ముందుగానే రాసిన చివరి కోరికల లేఖ వెలుగులోకి వచ్చింది.
కాపు ఉద్యమానికి చిరస్మరణీయ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ముగిశాయి. అయితే అంత్యక్రియల అనంతరం ఆయన జీవించి ఉండగానే కుటుంబ సభ్యులకు రాసిన ఒక లేఖ వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. తన మరణం తర్వాత అంత్యక్రియలు ఎలా నిర్వహించాలి, తనకు ఎలాంటి గౌరవాలు ఇవ్వకూడదు, కుటుంబ సభ్యులు ఎలా వ్యవహరించాలి వంటి అంశాలపై ముద్రగడ ముందుగానే స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ముద్రగడ తన లేఖలో, మరణానంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తాను మరణిస్తే ప్రభుత్వ తరఫున ఎలాంటి అధికారిక గౌరవ కార్యక్రమాలు నిర్వహించవద్దని కుటుంబ సభ్యులకు సూచించారు. పోలీసుల గార్డ్ ఆఫ్ హానర్ కూడా తనకు అవసరం లేదని, జీవించి ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తనకు మరణించిన తర్వాత ఇచ్చే అధికారిక గౌరవాలు అవసరం లేదని తన మనసులోని భావాలను లేఖలో వ్యక్తం చేశారు.
తన అంతిమ సంస్కారాల విషయంలో కూడా ముద్రగడ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేయకుండా, తనను ఖననం చేయాలని కోరారు. అంతేకాదు, ఇంటి ఆవరణలో ఎక్కడ సమాధి నిర్మించాలో కూడా లేఖలో పేర్కొన్నారు. కుటుంబానికి ఎప్పటికీ దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో తనను ఇంటి ఆవరణలోనే ఖననం చేయాలని కోరినట్లు వెల్లడైంది. ఈ కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించబడినట్లు సమాచారం.
మరోవైపు తన భార్య గురించి కూడా ముద్రగడ భావోద్వేగపూరిత కోరికను లేఖలో వ్యక్తం చేశారు. తాను మరణించిన తర్వాత భార్య బొట్టు, గాజులు తొలగించవద్దని, ఆమెను పుణ్యస్త్రీగానే కొనసాగించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. సంప్రదాయం పేరుతో మహిళపై అనవసర ఆచారాలు అమలు చేయవద్దని తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు.
అయితే ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం . ఈ అంశంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అధికారిక గౌరవాలతో పాటు పోలీసుల గార్డ్ ఆఫ్ హానర్ చేశారు. కానీ, దీనిపై ముద్రగడ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్రగడ స్వయంగా ప్రభుత్వ లాంఛనాలు వద్దని లేఖలో రాసి ఉంచినా, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని వారు వ్యతిరేకించారు. అంత్యక్రియల సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన గౌరవ కార్యక్రమాలకు నిరసన తెలుపుతూ “పోలీసులు గో బ్యాక్” అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ముద్రగడ చివరి కోరికలను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ముద్రగడ భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కిర్లంపూడికి చేరుకున్న జగన్, ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని ముద్రగడ పాడెను మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆయన కిర్లంపూడిలోనే ఉండి నివాళులర్పించారు.
ముద్రగడ పద్మనాభం మరణానంతరం వెలుగులోకి వచ్చిన ఈ లేఖ ఆయన వ్యక్తిత్వం, జీవితాంతం పాటించిన విలువలను మరోసారి చర్చకు తెచ్చింది. అధికారిక గౌరవాల కంటే వ్యక్తిగత ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆయన చివరి కోరికలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.
Hyderabad,Telangana

