Last Updated:
‘ఎవరికీ చెప్పొద్దు’ మూవీ ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా, నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాయ లేడీ’ (Maya Lady). ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
‘ఎవరికీ చెప్పొద్దు’ మూవీ ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా, నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మాయలేడీ’ (Maya Lady). ఈ సినిమాకు ప్రశంకర్ దర్శకత్వం వహించగా.. మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటించింది. ప్రమోషన్స్ పరంగా చిత్రాన్ని ఆడియన్స్ కి చేరువ చేసిన మేకర్స్, ఈ రోజు (నవంబర్ 13, 2026న) ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కామెడీ, సస్పెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మాయలేడీ’ కథేంటి? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
క్రిష్ (రాకేష్ వర్రే) వృత్తిరీత్యా మహిళలకు ఆత్మ రక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణ ఇచ్చే కోచ్. అతను తొలిచూపులోనే ఆశ (మధుమిత సర్కార్) అనే అందమైన అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో పడతాడు. అయితే తన ప్రేమను ఆమెకు వ్యక్తపరిచే లోపే, క్రిష్ జీవితంలోకి అనూహ్యంగా రూప (మధుమిత సర్కార్) ఎంట్రీ ఇస్తుంది. అచ్చం ఆశ లాగే ఉండటంతో రూపను ఆశ అనుకొని క్రిష్ ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ, కొంతకాలానికి తనతో ఉన్నది ఆశ కాదని, రూప అని తెలుసుకుంటాడు. అంతేకాకుండా ఆశకి ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని కూడా గ్రహిస్తాడు. అసలు ఆశ ఏమైంది? ఆమెకు ఉన్న సమస్య ఏంటి? మరి మధ్యలో వచ్చిన రూప ఎవరు, ఆమె ఎందుకు ఆశలా నటించింది? చివరకు క్రిష్ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? ఈ మొత్తం వ్యవహారంలో సీనియర్ నటి ఇంద్రజ పాత్ర ఏంటి? అనేది మిగతా కథ.
ఒక సింపుల్ ప్రేమకథకు కామెడీ, మిస్టరీ, సస్పెన్స్, ఎమోషన్స్ జోడించి కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశంకర్. ఫస్టాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్, ఆశ-రూపల మధ్య ఉన్న కన్ఫ్యూజన్, రూప చేసే అల్లరి పనులతో చాలా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా కమెడియన్ సత్య ఎంట్రీ తర్వాత ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ గా మారుతుంది. తనదైన టైమింగ్, కౌంటర్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ సెకండాఫ్ పై తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది.
కాకపోతే సెకండాఫ్ లో కథనం కాస్త నెమ్మదించడం సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్. ఆశ గతం, ఆమె సమస్య చుట్టూ తిరిగే ఎమోషనల్ సన్నివేశాలు కాస్త రొటీన్‌గా, ముందుగానే ఊహించేలా ఉంటాయి. దర్శకుడు ఎమోషన్స్‌ను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. అయినప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు, ట్విస్టులు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి.
సెల్ఫ్ డిఫెన్స్ కోచ్‌గా రాకేష్ వర్రే చాలా న్యాచురల్‌గా ఒదిగిపోయాడు. ఒకవైపు ఎమోషన్స్ పండిస్తూనే, యాక్షన్ సన్నివేశాల్లో తనదైన మార్క్ చూపించాడు. అయితే ఈ సినిమాకు ప్రధాన బలం, ఆకర్షణ బెంగాలీ బ్యూటీ మధుమిత సర్కార్. ఆశ, రూప అనే రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించి సినిమాకే హైలైట్‌గా నిలిచింది. కమెడియన్ సత్య కామెడీ వన్ లైనర్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.
సాంకేతికంగా చూస్తే.. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది, పాటలు డీసెంట్ గా ఉన్నాయి. యెదు రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ కి రిచ్‌నెస్ తీసుకొచ్చింది. రవితేజ గురిజాల ఎడిటింగ్ ఫస్టాఫ్ లో క్రిస్ప్ గా ఉన్నా, సెకండాఫ్ లో కాస్త ట్రిమ్ చేయాల్సింది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు ఎప్పటిలాగే కథకు తగ్గట్టుగా, ఉన్నతంగా ఉన్నాయి.
మొత్తానికి ‘మాయలేడి’.. సస్పెన్స్, మంచి కామెడీ ఉన్న ఒక క్లీన్ డీసెంట్ ఎంటర్టైనర్.
రేటింగ్: 2.75

