Last Updated:
ఇంట్లో గులాబ్ జామూన్లు చేసినప్పుడు కొన్నిసార్లు బయటకు బాగానే కనిపించినా లోపల గట్టిగా ఉండిపోతాయి. మరికొన్నిసార్లు పాకాన్ని సరిగ్గా పీల్చుకోక రుచిగా ఉండవు. గులాబ్ జామూన్లు దూదిలా మెత్తగా, లోపలివరకు రసంతో నిండిపోయి నోటిలో కరిగిపోయేలా రావాలంటే కొన్ని ముఖ్యమైన కొలతలు, చిట్కాలు పాటించాలి.
గులాబ్ జామూన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్వీట్. పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ మిఠాయిని ఎక్కువగా తయారు చేసుకుంటారు. అయితే ఇంట్లో గులాబ్ జామూన్లు చేసినప్పుడు కొన్నిసార్లు బయటకు బాగానే కనిపించినా లోపల గట్టిగా ఉండిపోతాయి. మరికొన్నిసార్లు పాకాన్ని సరిగ్గా పీల్చుకోక రుచిగా ఉండవు. గులాబ్ జామూన్లు దూదిలా మెత్తగా, లోపలివరకు రసంతో నిండిపోయి నోటిలో కరిగిపోయేలా రావాలంటే కొన్ని ముఖ్యమైన కొలతలు, చిట్కాలు పాటించాలి.
గులాబ్ జామూన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మెత్తటి గులాబ్ జామూన్లు తయారు చేయడానికి ఒక కప్పు మిల్క్ పౌడర్, పావు కప్పు మైదా పిండి, ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. పిండిని కలపడానికి సుమారు 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు అవసరమవుతాయి. పాకం కోసం ఒక కప్పు చక్కెర, ఒకటిన్నర కప్పు నీళ్లు, అర టీస్పూన్ యాలకుల పొడి, 4 నుంచి 5 కుంకుమపువ్వు రేకులు, కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకోవాలి.
పిండి కలిపే విధానం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మిల్క్ పౌడర్, మైదా పిండి, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నెయ్యి వేసి చేతులతో మృదువుగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పాలు పోస్తూ మెత్తటి పిండిలా తయారు చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలపకూడదు. చేతులతో ఎక్కువగా పిసికినా జామూన్లు గట్టిపడతాయి. పిండిని ఐదు నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచాలి. అనంతరం చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలపై పగుళ్లు లేకుండా చూసుకోవాలి.
చక్కెర పాకం తయారీ
ఒక గిన్నెలో చక్కెర, నీళ్లు వేసి స్టవ్‌పై మరిగించాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి మీడియం మంటపై 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. పాకం కొద్దిగా జిగురుగా మారినప్పుడు స్టవ్ ఆపేయాలి. తీగ పాకం వచ్చే వరకు మరిగించకూడదు. చివర్లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే పాకం గడ్డకట్టకుండా ఉంటుంది.
జామూన్లు వేయించే విధానం
బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి తక్కువ నుంచి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. నూనె మరీ వేడిగా ఉంటే జామూన్లు బయట త్వరగా రంగు మారి లోపల పచ్చిగా ఉండిపోతాయి. నూనె మరీ చల్లగా ఉన్నా ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. కాబట్టి మంటను నియంత్రిస్తూ జామూన్లను నెమ్మదిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఒకేసారి ఎక్కువ ఉండలు వేయకూడదు.
వేయించిన జామూన్లను ఒక నిమిషం పాటు పక్కన ఉంచి, గోరువెచ్చగా ఉన్న పాకంలో వేయాలి. కనీసం ఒకటి నుంచి రెండు గంటల పాటు పాకంలో ఉంచితే అవి లోపలివరకు పాకాన్ని పీల్చుకుంటాయి. ఇలా సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే హోటల్ తరహాలో మెత్తటి, రుచికరమైన గులాబ్ జామూన్లు తయారు చేసుకోవచ్చు.

