Last Updated:
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల కోసం పూజలు, జలాభిషేకాలు, కప్పతల్లి ఆటలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు వాన జాడ కనిపించకపోగా, మరోవైపు వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తొలకరి వానలతో ఆశలు చిగురించిన రైతులు పత్తి, సోయాబీన్, కంది తదితర పంటల విత్తనాలను చల్లగా, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని విత్తనాలు మాత్రమే మొలకెత్తగా, మరికొన్ని నేలలోనే ఉండిపోయాయి. మొలకెత్తిన పంటలు కూడా ఎండిపోకుండా కాపాడుకోవడానికి రైతులు తుంపర్ల ద్వారా, డ్రమ్ముల్లో నీటిని తీసుకొచ్చి స్ప్రేయర్లతో నీటిని అందిస్తూ నానా కష్టాలు పడుతున్నారు.
పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధ్యాత్మిక మార్గాన్నీ ఆశ్రయిస్తున్నారు రైతులు. వరుణుడి కరుణ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు, నైవేద్యాలు నిర్వహిస్తున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ కప్పతల్లి ఆటలు, అల్లు వంటి ప్రత్యేక ఆచారాలను నిర్వహిస్తూ వర్షదేవుడిని వేడుకుంటున్నారు. గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుండగా, రైతుల ప్రార్థనలతో గ్రామాల్లో భక్తి వాతావరణం నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని శివారు పోతులూరి వీరబ్రహ్మం ఆలయం వద్ద నిపాని, కప్పర్ల, పిప్పల్కోటి గ్రామాల రైతులు కలిసి వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాంసి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం ప్రారంభమైన 24 గంటల అఖండ భజన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వరుణదేవుడి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నారు. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో రైతులు డప్పుల మోత మధ్య కప్పతల్లి ఆట నిర్వహిస్తూ గ్రామ వీధులన్నీ తిరిగి ఇంటింటికీ వెళ్లి వర్షాలు కురవాలని ప్రార్థించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేస్తవార్పేట మహిళలు వర్షాల కోసం భక్తి గీతాలు ఆలపిస్తూ హనుమాన్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. బాసరలో రైతులు, కుల సంఘాల పెద్దలు గోదావరి నది నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి గ్రామ దేవతలకు, మహాపోచమ్మ ఆలయంలో జలాభిషేకం చేశారు. కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలో మహిళలు, చిన్నారులు బిందెలతో భారీ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతిరోజూ ఏదో ఒక గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
వాన కోసం రైతులు చేస్తున్న ఈ ప్రార్థనలు వారి నిస్సహాయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన వర్షాలతో పంటల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారగా, ఇకనైనా వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని రైతులు వేడుకుంటున్నారు. పాడిపంటలతో పొలాలు కళకళలాడాలని, రైతు కుటుంబాల్లో మళ్లీ ఆనందం వెల్లివిరియాలని జిల్లావ్యాప్తంగా ప్రజలు ఒకే మనసుతో ప్రార్థిస్తున్నారు.
Adilabad,Adilabad,Telangana
