Last Updated:
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి కళ్ల ముందే నాలుగేళ్ల పసికందు ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయాడు.
ఈ హృదయ విదారక ఘటన ఢిల్లీలోని దాస్ గార్డెన్ కాలనీ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. స్థానిక కాలనీకి చెందిన ఇమ్రాన్ (4) అనే బాలుడు మంగళవారం సాయంత్రం తన తల్లితో కలిసి ఆడుకోవడానికి సమీపంలోని పార్క్‌కు వచ్చాడు. కొద్దిసేపు సరదాగా ఆడుకున్న తర్వాత మూత్ర విసర్జన కోసం పక్కనే ఉన్న మురుగు కాలువ సమీపానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ప్రమాదకరంగా తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌ను చిన్నారి గమనించకపోవడంతో ఒక్కసారిగా అందులోకి జారిపడిపోయాడు. క్షణాల వ్యవధిలో కళ్లముందే బిడ్డ మ్యాన్‌హోల్‌లో పడిపోవడంతో తల్లి దిగ్భ్రాంతికి గురై తీవ్రంగా రోదించింది.
వెంటనే స్పందించిన స్థానికులు బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగి మురుగు కాలువలో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాలుడిని సురక్షితంగా వెలికితీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS), ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నప్పటికీ బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

