Last Updated:
ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) రూ.5,000 కోట్లకు పైగా సైబర్ మోసాలను అడ్డుకుంది. 2025 మే 22న ప్రారంభమైన ఈ వ్యవస్థ 15 నెలల్లోనే ఈ స్థాయికి చేరుకుంది.
సైబర్ మోసాలు జరగకముందే వాటిని అడ్డుకుంటే ప్రజల కష్టార్జితం కాపాడొచ్చు. ఇదే లక్ష్యంతో కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ తీసుకొచ్చిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) ఇప్పటివరకు రూ.5,000 కోట్లకు పైగా అనుమానిత సైబర్ మోసాల నష్టాన్ని అడ్డుకుందని కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది. 2025 మే 22న ప్రారంభమైన ఈ వ్యవస్థ 15 నెలల్లోనే ఈ స్థాయికి చేరుకుంది. FRI ద్వారా 2026 ఆగస్టు నాటికి రూ.5,043.73 కోట్ల మేర అనుమానిత మోసాలను అడ్డుకున్నారు. మొదటి ఆరు నెలల్లో అడ్డుకున్న మొత్తం రూ.660 కోట్లు మాత్రమే. ఆ తర్వాత బ్యాంకులు, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు FRIని ఎక్కువగా ఉపయోగించడంతో మోసాలను అడ్డుకునే సామర్థ్యం దాదాపు ఎనిమిది రెట్లు పెరిగింది. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్లో 1,600కు పైగా సంస్థలు చేరాయి. 1,500 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థలకు FRIపై 25కి పైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల డబ్బు ఖాతా నుంచి బయటకు వెళ్లకముందే ఆపడం వల్ల చాలా పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఒక మోసం అడ్డుకుందని అంటే ఆ డబ్బును వెతకాల్సిన అవసరం ఉండదు. ఖాతాను ఫ్రీజ్ చేయాల్సిన పని ఉండదు. ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, రికార్డులు సేకరించడం, నెలల తరబడి ఫాలోఅప్ చేయడం వంటి పనులు కూడా ఉండవు.

