Last Updated:
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ గురువారం దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా, ప్రపంచంలో మూడో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. మధ్యాహ్నం ఏక్యూఐ 364గా నమోదు కావడంతో పర్యావరణవేత్తలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛమైన గాలికి, ప్రకృతి అందాలకు చిరునామాగా నిలిచే జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ ప్రస్తుతం తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రియల్-టైమ్ ఎయిర్ క్వాలిటీ డేటా ప్రకారం.. శ్రీనగర్ దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా, ప్రపంచంలో మూడో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ‘ఏక్యూఐ.ఇన్’ (aqi.in) గణాంకాల ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో శ్రీనగర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 364గా నమోదైంది. ఇదే సమయంలో ఢిల్లీలో ఏక్యూఐ 160 మాత్రమే ఉండటం గమనార్హం.
శ్రీనగర్ లోయలో ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండగా, గాలిలో ప్రమాదకర పీఎం 2.5 స్థాయులు 257గా, పీఎం 10 స్థాయులు 334గా నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో శ్రీనగర్ తర్వాత బీహార్‌కు చెందిన సహర్సా, బెగుసరాయ్, పాట్నా, భాగల్‌పూర్ నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అయితే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) విడుదల చేసిన 24 గంటల సగటు గణాంకాల్లో శ్రీనగర్ ఏక్యూఐ 180గా నమోదైంది. రియల్-టైమ్ డేటా కంటే ఇది చాలా తక్కువగా ఉన్నప్పటికీ, రెండు వేర్వేరు సమయ ప్రాతిపదికలపై లెక్కించడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. చలికాలంలో లోయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొడి వాతావరణం, వాహనాల పొగ, చలిమంటల వాడకం పెరగడం వల్ల కాలుష్య కణాలు భూమికి దగ్గరగా నిలిచిపోయి గాలి నాణ్యత క్షీణిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

శ్రీనగర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై పుల్వామా ఎమ్మెల్యే వహీద్ ఉర్ రెహమాన్ పారా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలికి పేరుగాంచిన శ్రీనగర్ ఇప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోందని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన చెందారు. ఢిల్లీలో ఏక్యూఐ 255 ఉంటే, శ్రీనగర్‌లో ఏకంగా 663కి తాకినట్లు వార్తలు రావడం కలవరపెడుతోందన్నారు. అడవులు, చిత్తడి నేలలు, జీవవైవిధ్యాన్ని విచ్చలవిడిగా నాశనం చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని, పర్యావరణ పరిరక్షణకు తక్షణమే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Srinagar’s AQI has reportedly hit 663, while Delhi stands at 255. Let that sink in. A place once known for its pristine air is now choking on pollution. We are losing our forests, wetlands and biodiversity to unchecked destruction. How much more of Kashmir’s paradise must we lose before its environment becomes a priority?
— Waheed Ur Rehman Para (@parawahid) November 25, 2026

