Last Updated:
భారత్ ఆర్థిక సంక్షోభంలో ఉందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ గట్టి సమాధానమిచ్చారు. గత 12 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 7 శాతం వృద్ధితో భారత్ దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఫిక్కీ (FICCI) శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని స్పష్టం చేశారు. 21వ శతాబ్దం ఆరంభంలో ‘ఫ్రాజైల్ 5’ (బలహీన ఆర్థిక వ్యవస్థలు) జాబితాలో ఉన్న భారత్, నేడు ప్రపంచ వృద్ధి ఇంజిన్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు నివేదికను ఉటంకిస్తూ, గత 12-13 ఏళ్లలో దేశంలో దాదాపు 50 కోట్ల మంది అసాధారణ వేగంతో పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ తెలిపారు. 1970లలో ‘గరీబీ హటావో’ నినాదం ఇచ్చినప్పుడు దేశ జనాభా 50 కోట్లు మాత్రమేనని, అప్పట్లో విధానాలు, చిత్తశుద్ధి లోపించడం వల్లే పేదరికాన్ని నిర్మూలించలేకపోయారని కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు.
న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిరుద్యోగం, తయారీ రంగ వైఫల్యాలతో భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ప్రధాని మోదీ దేశ ఆర్థిక ప్రగతిని గణాంకాలతో వివరించారు. అక్టోబర్ నెలలో దేశ సరుకుల ఎగుమతులు రికార్డు స్థాయిలో 50 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెప్పారు. మన బలమైన పనితీరు చూసి ప్రపంచ బ్యాంకు, మూడీస్, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను 7 శాతం లేదా అంతకంటే ఎక్కువకు సవరిస్తున్నాయని గుర్తుచేశారు.
#WATCH | Delhi: At FICCI’s centenary convention, PM Narendra Modi says, “Today, India is the world’s fastest-growing major economy, projected to grow at around 7%. In October, India’s goods exports reached nearly $50 billion, our highest-ever monthly goods export. It is due to India’s strong performance that agencies like Moody’s Ratings, S&P Global Ratings, Fitch Ratings, the World Bank, and the Asian Development Bank (ADB) are revising our growth forecasts upward.”
— ANI (@ANI) November 19, 2026
వనరులను ఆయుధాలుగా వాడుకుంటున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ‘ఇండియా ఫస్ట్’ నినాదంతో స్వావలంబన సాధించాలని పారిశ్రామికవేత్తలకు ప్రధాని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో రాబోయే 20 ఏళ్లలో ఏం సాధించగలమో పరిశ్రమ వర్గాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. నా మాట వినకపోయినా కనీసం మహాత్మా గాంధీ చెప్పిన స్వదేశీ సూత్రాలనైనా పాటించాలని మోదీ హితవు పలికారు.
ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచిన భారత్, ఔషధ తయారీకి అవసరమైన ముడిసరుకుల (ఏపీఐలు, బల్క్ డ్రగ్స్) కోసం ఇప్పటికీ విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని మోదీ ప్రస్తావించారు. దిగుమతులపై ఆధారపడే విభాగాలను గుర్తించి, దేశీయంగానే వాటిని ఉత్పత్తి చేసే సాంకేతికతపై పెట్టుబడులు పెట్టాలని ఫార్మా రంగానికి ప్రధాని పిలుపునిచ్చారు.

