Last Updated:
తమిళనాడులోని కొళత్తూర్ టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) గురువారం చెన్నైలో కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యతో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 2026 ఎన్నికల్లో మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించి బాబు సంచలనం సృష్టించారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన కొళత్తూర్ ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) కన్నుమూశారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన ఆయన గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ సెప్టెంబర్ 9న ఆసుపత్రిలో చేరిన బాబు, 70 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందారు. వైద్యుల బృందం ఎంతగా ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం విషమించి గుండెపోటు రావడంతో నవంబర్ 19 మధ్యాహ్నం 2.24 గంటలకు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి.
ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ కంచుకోట అయిన కొళత్తూర్ నుంచి విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థిగా పోటీ చేసిన బాబు, ఏకంగా 8,795 ఓట్ల మెజారిటీతో స్టాలిన్‌పై గెలిచి ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
వీఎస్ బాబు మృతి పట్ల తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ప్రజాసేవను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్, మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటిస్తూ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
గతంలో డీఎంకేలో కీలక నేతగా పనిచేసిన బాబు 2006లో పురసైవాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరి, 2026 ఫిబ్రవరిలో టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. నాడు స్టాలిన్ గెలుపునకు కృషి చేసిన బాబు, 2026 ఎన్నికల్లో అదే స్టాలిన్‌ను ఓడించి ‘జెయింట్ కిల్లర్’గా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణంతో టీవీకే శ్రేణుల్లో విషాదం నెలకొంది.

