Last Updated:
ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు NEFT ద్వారా డబ్బులు పంపుతున్నారా? అయితే రూ.50 వేలకే పరిమితి ఉందని అనుకుంటున్నారా? వాస్తవానికి బ్యాంకు ఖాతా నుంచి చేసే బదిలీలకు ఆర్బీఐ ఎలాంటి గరిష్ఠ పరిమితి విధించలేదు.
డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ, ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు పంపేందుకు చాలామంది నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) సేవను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విధానంలో గరిష్ఠంగా ఎంత మొత్తం బదిలీ చేయవచ్చు? రూ.50 వేలకు మించి పంపడం సాధ్యమేనా? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి చేసే బదిలీలకు, నగదు రూపంలో చేసే చెల్లింపులకు వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి.
NEFT లావాదేవీలపై ఆర్బీఐ ఎలాంటి గరిష్ఠ నగదు పరిమితిని విధించలేదు. అంటే ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు రూ.50 వేలకు మించి కూడా డబ్బులు పంపవచ్చు. అయితే ప్రతి బ్యాంకు తన రిస్క్ అంచనాల ఆధారంగా లావాదేవీలపై పరిమితులు నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధిత బ్యాంకు బోర్డు ఆమోదం తప్పనిసరి. కాబట్టి ఎంత మొత్తం పంపవచ్చనేది వినియోగదారుడు ఖాతా కలిగి ఉన్న బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు కూడా NEFT సేవను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం NEFT సదుపాయం ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లి నగదు జమ చేయాలి. అయితే ఈ విధానంలో ఒక లావాదేవీకి గరిష్ఠంగా రూ.50 వేలు మాత్రమే పంపేందుకు అనుమతి ఉంది. నగదు పంపే వ్యక్తి తన పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను కూడా బ్యాంకుకు అందించాలి. 2024 సెప్టెంబర్ 2న నవీకరించిన NEFT ప్రశ్నలు-సమాధానాల్లో ఆర్బీఐ ఈ విషయాలను వెల్లడించింది.
బయటకు పంపే NEFT లావాదేవీలపై బ్యాంకులు వసూలు చేయగల గరిష్ఠ ఛార్జీలను ఆర్బీఐ నిర్ణయించింది. అయితే కొన్ని సేవలకు ఛార్జీలు ఉండవు. సేవింగ్స్ ఖాతాల నుంచి ఆన్లైన్లో చేసే NEFT బదిలీలను 2020 జనవరి 1 నుంచి ఉచితంగా అందిస్తున్నారు. అలాగే డబ్బులు స్వీకరించే బ్యాంకులు, ఖాతాలో నగదు జమ చేసినందుకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు.
NEFT సేవలు వారాంతాలు, బ్యాంకు సెలవులతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. రోజులో 24 గంటలు, వారంలో ఏడు రోజులూ, ఏడాదిలో 365 రోజులూ ఈ విధానంలో డబ్బులు పంపవచ్చు. లావాదేవీలు ప్రతి అరగంటకు ఒకసారి బ్యాచ్‌ల రూపంలో ప్రాసెస్ అవుతాయి. సంబంధిత బ్యాచ్ సెటిల్మెంట్ పూర్తయిన తర్వాత సాధారణంగా రెండు గంటల్లో లబ్ధిదారుడి ఖాతాలో నగదు జమ కావాలి. లావాదేవీ పూర్తయినట్లు పంపిన వ్యక్తికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆలస్యంగా నగదు జమ అయినా, లావాదేవీ తిరిగి వచ్చినా నిబంధనల ప్రకారం జరిమానా వడ్డీ వర్తిస్తుంది.
NEFT కేవలం వ్యక్తుల మధ్య నగదు బదిలీలకే పరిమితం కాదు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు, రుణాల ఈఎంఐలు, విదేశాల నుంచి వచ్చే నగదు బదిలీలు వంటి వాటికీ ఈ సేవను వినియోగించవచ్చు. భారత్ నుంచి నేపాల్‌కు ఒకవైపు నగదు పంపే సదుపాయం కూడా ఇందులో ఉంది.
NEFT ద్వారా డబ్బులు పంపేటప్పుడు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా వివరాలతో పాటు IFSC కోడ్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది 11 అక్షరాలు, అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కోడ్. ఇందులో మొదటి నాలుగు అక్షరాలు బ్యాంకును సూచిస్తాయి. ఐదో అక్షరం ఎప్పుడూ సున్నా (0)గా ఉంటుంది. చివరి ఆరు అక్షరాలు సంబంధిత బ్యాంకు శాఖను గుర్తిస్తాయి. సరైన ఖాతాకు నగదు చేరేందుకు ఈ కోడ్ కీలకంగా పనిచేస్తుంది.

