Last Updated:
చైనాలోని షెన్జెన్ వేదికగా గురువారం జరగనున్న చారిత్రక తొలి త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సుకు ముందు అమెరికా, చైనా, రష్యా అధ్యక్షులు ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ ఆత్మీయంగా పలకరించుకున్నారు.
ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలోని షెన్జెన్ నగరంలో కలుసుకున్నారు. గురువారం జరగనున్న చారిత్రక తొలి త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సుకు ముందు, అపెక్ (APEC) విందు సందర్భంగా ఈ ముగ్గురు అగ్రనేతలు గ్రూప్ ఫోటో కోసం నిలబడి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు విమానాశ్రయానికి స్వయంగా వచ్చిన జిన్‌పింగ్, యుద్ధ విమానాల గౌరవ వందనం, జాతీయ గీతాలాపనల మధ్య ట్రంప్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.
గత సెప్టెంబర్‌లో తనకు ట్రంప్ ఇచ్చిన ఆతిథ్యానికి బదులుగా దశాబ్దాల సంప్రదాయాన్ని పక్కనపెట్టి జిన్‌పింగ్ స్వయంగా విచ్చేయడం విశేషం. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ పరిణామాలపై లోతైన చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు.
త్రైపాక్షిక సదస్సు ఎజెండాపై స్పష్టత లేనప్పటికీ, ఫిబ్రవరిలో అమెరికా-రష్యా అణు ఒప్పందం ముగిసిన నేపథ్యంలో అణ్వాయుధాల తగ్గింపు, ఇరాన్ యుద్ధంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం చర్చకు రాదని తొలుత అమెరికా సంకేతాలిచ్చినా, తప్పకుండా చర్చిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు 2022 ఉక్రెయిన్ దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు పూర్తిగా విఫలమయ్యాయని పుతిన్ తేల్చిచెప్పారు.
చైనా పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉందని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు జిన్‌పింగ్, పుతిన్ విడిగా సమావేశమై సైనిక, రాజకీయ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. కాగా, అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో పది నెలల్లోనే చైనాను అందుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అపెక్ సదస్సులో వాణిజ్య వేడిని రాజేశాయి.

