Last Updated:
AI Company IPO | స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మరో కొత్త ఐపీఓ వార్త అందుబాటులోకి వచ్చింది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేస్తున్న మెగానెట్ టెక్నాలజీస్ రూ.740 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓకు సంబంధించిన పూర్తి వివరాలు, కంపెనీ ఆదాయం, లాభాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఏఐ (AI) టెక్నాలజీ రంగంలో వేగంగా ఎదుగుతున్న మెగానెట్ టెక్నాలజీస్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.740 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు సమర్పించింది. పీటీఐ కథనం ప్రకారం.. హైఎండ్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలు అందించే మెగానెట్ టెక్నాలజీస్ గ్లోబల్ లిమిటెడ్, ఐపీఓ ద్వారా మొత్తం రూ.740 కోట్లు సమీకరించనుంది. నవంబర్ 16న సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఈ ఐపీఓలో రూ.140 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనుంది. వీటితో పాటు ప్రమోటర్లు తమ దగ్గరున్న రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో విక్రయించనున్నారు.
కొత్త షేర్ల ద్వారా వచ్చే డబ్బును కంపెనీ వివిధ అవసరాలకు ఉపయోగించనుంది. ఇందులో రూ.100 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కేటాయించనుంది. మరో రూ.11 కోట్లను తీసుకున్న కొన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి లేదా ముందుగానే తీర్చడానికి ఉపయోగించనుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఖర్చు చేయనుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మెగానెట్ కంపెనీ ఏఐ సర్వర్లు, వర్క్స్టేషన్లు, డేటా సెంటర్ సర్వర్ సొల్యూషన్స్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్, స్టోరేజ్ సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్‌తో పాటు సంబంధిత సేవలను అందిస్తోంది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 2,600 మందికి పైగా కస్టమర్లకు సేవలు అందించింది.
నవీ ముంబైలోని మహాపే ప్రాంతంలో కంపెనీకి తయారీ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో ఏడాదికి 5,928 సర్వర్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) కంపెనీ మొత్తం 2,621 సర్వర్లను తయారు చేసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలను చూస్తే.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.368.31 కోట్ల నుంచి రూ.447.12 కోట్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25) రూ.30.22 కోట్లుగా ఉన్న పన్నుల తర్వాత లాభం (PAT), 2025-26లో రూ.37.94 కోట్లకు చేరింది. ఇక 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల కాలానికి కంపెనీ రూ.1,225 కోట్ల కార్యకలాపాల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో పన్నుల తర్వాత లాభం రూ.42.57 కోట్లుగా నమోదైంది.
భారత్‌లో ఏఐ సర్వర్ల మార్కెట్ కూడా రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉందని ఫ్రాస్ట్ అండ్ సుల్లివన్ నివేదిక అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.45,510 కోట్లుగా ఉన్న భారత ఏఐ సర్వర్ల మార్కెట్, 2031-32 ఆర్థిక సంవత్సరం (FY32) నాటికి రూ.1,82,820 కోట్లకు చేరుకోవచ్చు. అంటే ఏడాదికి సగటున దాదాపు 26 శాతం చొప్పున వృద్ధి చెందే అవకాశం ఉంది. మెగానెట్ టెక్నాలజీస్‌కు బ్లాక్ బాక్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్, యొట్టా డేటా సర్వీసెస్, వెస్ట్రన్ డిజిటల్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి. ఈ ఐపీఓకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.
Disclaimer: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. ఇందులోని వివరాలు అందుబాటులో ఉన్న సమాచారం, కంపెనీ సమర్పించిన పత్రాలు, నివేదికల ఆధారంగా అందించాం. ఇది ఎలాంటి పెట్టుబడి సలహా కాదు. మెగానెట్ టెక్నాలజీస్ ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఆర్థిక నివేదికలు, ఐపీఓ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించండి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోండి.

