Last Updated:
PM Modi: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫిలిప్పీన్స్‌లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంగళవారం రాజధాని మనీలాలోని అత్యంత పురాతన సిక్కు ప్రార్థనా మందిరమైన చారిత్రాత్మక ‘గురుద్వారా ఖల్సా దివాన్’ను సందర్శించారు.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ గురుద్వారా పునరాభివృద్ధి (రీడెవలప్మెంట్) పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్శన అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ (X) వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. “మనీలాలోని గురుద్వారా ఖల్సా దివాన్‌ను సందర్శించడం నాకు ఎంతో ఆశీర్వాదంగా, ధన్యతగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు. మరోవైపు, ఖల్సా దివాన్ గురుద్వారా గత శతాబ్ద కాలంగా భారత్-ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
ఈ పర్యటన వివరాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గురుద్వారా పునరాభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, అక్కడి సిక్కు సమాజం (సంగత్) సభ్యులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారని తెలిపారు. గురునానక్ దేవ్ జీ బోధనలను అనుసరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజం ప్రేమ, సమానత్వం, కరుణ, సేవా భావాన్ని చాటుతోందని కొనియాడారు. ఇతర దేశాల్లో మాదిరిగానే ఫిలిప్పీన్స్‌లోని సిక్కు సమాజం కూడా భారతీయ ప్రవాసులలో ఒక అంతర్భాగమని పేర్కొన్నారు. సిక్కు, బౌద్ధ అంశాల కలయికతో నిర్మితమైన ఈ చారిత్రాత్మక గురుద్వారా ఒక ముఖ్యమైన మతపరమైన, సాంస్కృతిక కేంద్రమని ఆయన అభివర్ణించారు.
Feeling very blessed to be at the Gurudwara Khalsa Diwan in Manila.
ਗੁਰਦੁਆਰਾ ਖ਼ਾਲਸਾ ਦੀਵਾਨ, ਮਨੀਲਾ ਵਿਖੇ ਆ ਕੇ ਬਹੁਤ ਵਡਭਾਗਾ ਮਹਿਸੂਸ ਕਰ ਰਿਹਾ ਹਾਂ। https://t.co/JNuNFMq6Ja— Narendra Modi (@narendramodi) November 17, 2026
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సోమవారం మనీలా చేరుకున్నారు. మంగళవారం జరగనున్న 23వ ఆసియాన్-ఇండియా (ASEAN-India) సదస్సు, 21వ తూర్పు ఆసియా (East Asia) సదస్సులలో ఆయన పాల్గొననున్నారు. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఈ సదస్సులలో చర్చించనున్నారు. అలాగే, ఆసియాన్ సమావేశాల సందర్భంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన ‘క్వాడ్’ (Quad) నేతల సమావేశంలోనూ ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
సోమవారం మనీలా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఫిలిప్పీన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి రాబర్ట్ జోసెఫ్ ‘జే’ మోంటెస్ డి క్లారో ఘన స్వాగతం పలికారు. అనంతరం హోటల్ వద్దకు చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు, స్థానిక కళాకారులు సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలతో ఆత్మీయ స్వాగతం పలికారు.

