Last Updated:
‘రామాయణ’ సినిమా విడుదలకు ముందే ఎన్నో విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల ఎంపికపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
‘రామాయణ’ సినిమా విడుదలకు ముందే ఎన్నో విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, నటీనటుల ఎంపికపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి ఎంపికను కొందరు ప్రేక్షకులు వ్యతిరేకించారు. అంతేకాదు.. రణ్‌బీర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను బీఫ్ తింటానని చెప్పిన పాత వీడియో కూడా వైరల్ కావడంతో ఆయన రాముడి పాత్రకు సరిపోతారా? అంటూ ప్రశ్నలు తలెత్తాయి.
అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాల్లో మార్పు వచ్చిందని చిత్రంలో కౌసల్య పాత్ర పోషించిన నటి ఇంద్ర కృష్ణన్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినిమా నిర్మాణం, రణ్‌బీర్ ఎదుర్కొన్న ట్రోలింగ్, ప్రేక్షకుల స్పందన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘ఇంత భారీ సినిమాను నిర్మించడం నిర్మాత నమిత్ మల్హోత్రాకు పెద్ద రిస్క్‌తో కూడుకున్న పని. నేటి ప్రపంచ ప్రేక్షకులకు రామాయణాన్ని పరిచయం చేయడానికి ఆయన ఎన్నో హద్దులను దాటి ప్రయత్నించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ‘ది ఒడిస్సీ’ వంటి చిత్రాలతో పోలుస్తున్నారు. కానీ సినిమా విడుదలకు ముందు మాత్రం చాలామంది ప్రేక్షకులకు దీనిపై నమ్మకం లేదు’ అని ఇంద్ర తెలిపారు.
ముఖ్యంగా రణ్‌బీర్‌ను రాముడిగా ఎంపిక చేయడంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ‘నువ్వు బీఫ్ తినే వ్యక్తికి తల్లిగా నటిస్తున్నావా?’ అంటూ తనకు కొందరు మెసేజ్‌లు కూడా పంపారని వెల్లడించారు. రణ్‌బీర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఆయన వ్యక్తిగత ఆహారపు అలవాట్లను రాముడి పాత్రతో ముడిపెట్టి విమర్శలు చేశారని వివరించారు.
రణ్‌బీర్‌పై ట్రోలింగ్.. ఇంద్ర ఏమన్నారంటే?
రణ్‌బీర్ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొన్నారో కూడా ఇంద్ర కృష్ణన్ వివరించారు. ‘రణ్‌బీర్‌ను సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎలాంటి విమర్శలకు స్పందించకుండా సెట్స్‌కు వచ్చి తన వంతుగా 200 శాతం కష్టపడ్డారు. కొన్ని ట్రోలింగ్స్ వెనుక డబ్బులు తీసుకున్నవారు కూడా ఉండొచ్చని నాకు అనిపించింది. రామాయణ విజయం సాధించదని భావించినవాళ్లు కూడా ఉన్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
సినిమా ప్రయత్నాన్ని అర్థం చేసుకోకుండా ముందుగానే విమర్శించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేసిందని చెప్పారు. ‘ధురంధర్’ సినిమా కూడా విడుదలకు ముందు ట్రోలింగ్ ఎదుర్కొంది. కానీ తర్వాత మంచి విజయాన్ని సాధించింది. అయితే రామాయణాన్ని మరే ఇతర సినిమాతోనూ పోల్చాలని నేను అనుకోవడం లేదు. ఇది అద్భుతమైన చిత్రం. ప్రపంచ ప్రేక్షకుల కోసం ఇలాంటి సినిమాను రూపొందించగలిగినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని ఇంద్ర తెలిపారు.
రణ్‌బీర్ వల్లే కౌసల్య పాత్ర వచ్చిందా?
ఇంద్ర కృష్ణన్ గతంలోనే తనకు ‘రామాయణ’లో కౌసల్య పాత్ర రావడం వెనుక రణ్‌బీర్ ఉన్నారని వెల్లడించారు. ‘యానిమల్’ సినిమా చివరి రోజు రష్మిక మందన్న నన్ను మరో తెలుగు సినిమాలో తన తల్లిగా నటించాలని కోరింది. అప్పుడు రణ్‌బీర్ వెంటనే స్పందిస్తూ.. ఆమెకే ఎందుకు? నా తల్లిగా కూడా నటించవచ్చు కదా అన్నారు. అప్పుడు నేను సరదాగా.. తర్వాతి సినిమాలో రణ్‌బీర్ తల్లిగా నటిస్తానని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. ఈ అవకాశం రావడానికి నా గురించి రామాయణ చిత్ర బృందంతో మంచి మాట చెప్పిన రణ్‌బీర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి’ అని ఆమె వెల్లడించారు.
మొత్తంగా విడుదలకు ముందు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రామాయణ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని ఇంద్ర కృష్ణన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రోలింగ్‌కు స్పందించకుండా తన పనితోనే సమాధానం చెప్పిన రణ్‌బీర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

