Last Updated:
దీపావళి పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పాకిస్థాన్‌కు చురకలు అంటిస్తూ గతేడాది నాటి ‘ఆపరేషన్ సింధూర్’ దాడి వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీపాల పండుగ దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ భారతీయ జనతా పార్టీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తమ అధికారిక ఎక్స్ ఖాతాలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ నాటి మెరుపు దాడుల వీడియోను పోస్ట్ చేసింది. “ఇది ఎప్పటికీ పాతబడదు… ఎవరికో అర్థమయ్యే ఉంటుంది.. మీకు హ్యాపీ దీపావళి!” అనే ఆసక్తికర క్యాప్షన్‌ను జత చేసింది. సరిహద్దు దాటి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం బాంబుల వర్షం కురిపించిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. పరోక్షంగా పాకిస్థాన్‌ను టార్గెట్ చేస్తూ పెట్టిన ఈ పోస్ట్‌కు భారత నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. పటాకుల వేళ అసలైన దీపావళి వెలుగులు చూపించారంటూ దేశవ్యాప్తంగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
This never gets old… Happy Diwali to you-know-who! 😉🪔 https://t.co/YTjmiRp3OG
— BJP (@BJP4India) November 8, 2026
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో మెరుపు దాడిని చేపట్టాయి. మే 6-7 అర్ధరాత్రి వేళ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓజేకే), పాక్ భూభాగంలోని తొమ్మిది కీలక ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన విరుచుకుపడింది. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపులకు చెందిన లాంచ్ ప్యాడ్లను బాంబులతో నేలమట్టం చేసింది.
@BJP4India modi ji ek baar aur esa program dikha do maza aajayega
— jackson lamb (george costanza) (@stewie50703) November 8, 2026
ఈ మెరుపు దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు, వారి హ్యాండ్లర్లు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పౌర నష్టం జరగకుండా అత్యంత పక్కా ప్రణాళికతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. భారత సార్వభౌమాధికారంపై దాడి చేస్తే ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయో గుర్తుచేస్తూ బీజేపీ చేసిన ఈ దీపావళి పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

