Last Updated:
Supreme Court: పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్టు నమోదు చేయడంలో జాప్యం చేసినా తప్పించుకోలేరు. అధికారికంగా అరెస్టు చేసిన సమయం కాకుండా, మొదటిసారి అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల గడువు లెక్కించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేలా ఈ స్పష్టత ఇచ్చింది.
ఒక వ్యక్తిని పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్న తర్వాత అధికారికంగా అరెస్టు నమోదు చేయడంలో జాప్యం చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేసినట్లు రికార్డుల్లో చూపించిన సమయం నుంచే 24 గంటల గడువును లెక్కించాలనే వాదనను అంగీకరించలేమని తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి స్వేచ్ఛను వాస్తవంగా హరించి, తమ అదుపులోకి తీసుకున్న సమయం నుంచే ఈ గడువు ప్రారంభమవుతుందని కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను తప్పించుకోవడానికి అరెస్టు ప్రక్రియలో జాప్యం చేయడం సరికాదని పేర్కొంది.
వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఈ ముఖ్యమైన తీర్పును న్యాయమూర్తులు ఉజ్జల్ భూయాన్, అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం గురువారం వెలువరించింది. అరెస్టు చేయడం, నిర్బంధంలో ఉంచడం మధ్య కృత్రిమమైన తేడాలు చూపించి, ఒక వ్యక్తిని న్యాయస్థానం పర్యవేక్షణకు దూరంగా ఎక్కువ సమయం అదుపులో ఉంచేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ‘సుజిత్ దాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఈ తీర్పు వెలువడింది.
త్రిపురలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన దర్యాప్తులో ఈ వివాదం మొదలైంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద చేపట్టిన తనిఖీల్లో 11.03 కిలోల యాబా మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2025 సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారిని దర్యాప్తు బృందం తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే అధికారికంగా అరెస్టు చేసినట్లు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మాత్రమే నమోదు చేసింది. నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు 24 గంటల గడువును అధికారిక అరెస్టు సమయం నుంచే లెక్కించాలని దర్యాప్తు సంస్థ వాదించింది. కానీ నిందితులు దీనిని వ్యతిరేకించారు. సెప్టెంబర్ 29 మధ్యాహ్నం నుంచే తమను అధికారులు అదుపులోకి తీసుకున్నారని, ఆ సమయాన్ని లెక్కలోకి తీసుకోవాలని కోరారు.
ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటల నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని పేర్కొంది. అంటే మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలలోపు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ అధికారులు సెప్టెంబర్ 30న సాయంత్రం 4.45 గంటలకు మాత్రమే కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీంతో రాజ్యాంగం నిర్దేశించిన గడువు ఉల్లంఘనకు గురైందని ధర్మాసనం గుర్తించింది. నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం, అరెస్టయిన ప్రతి వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అరెస్టు జరిగిన ప్రాంతం నుంచి కోర్టుకు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని మాత్రమే ఈ లెక్కింపు నుంచి మినహాయిస్తారు. పోలీసులు ఒక వ్యక్తిని తమ అదుపులో ఉంచినంత మాత్రాన, న్యాయస్థానం పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారం నిర్బంధించే అధికారం వారికి ఉండదు. ఈ నిబంధన ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది.
అయితే విచారణ పేరుతో ఒకరిని అదుపులోకి తీసుకుని, అధికారిక అరెస్టు నమోదు చేయకుండా గంటల తరబడి ఉంచితే ఈ హక్కు బలహీనపడే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాంటి పరిస్థితిని రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది. విచారణ సమయంలో ఉద్దేశపూర్వకంగా అరెస్టు ప్రక్రియను ఆలస్యం చేయడం వల్ల కస్టడీలో వేధింపులకు అవకాశం ఏర్పడుతుందని కూడా హెచ్చరించింది.
ఈ తీర్పుతో దర్యాప్తు సంస్థలు ఒక వ్యక్తిని వాస్తవంగా ఎప్పుడు అదుపులోకి తీసుకున్నాయో స్పష్టంగా నమోదు చేయాల్సిన బాధ్యత పెరిగింది. తర్వాత అధికారికంగా అరెస్టు చేసినట్లు రికార్డుల్లో చూపించినంత మాత్రాన 24 గంటల గడువు మళ్లీ మొదలుకాదు. అలాగే రిమాండ్కు అనుమతి ఇచ్చే ముందు మేజిస్ట్రేట్లు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్న అరెస్టు సమయాన్నే గుడ్డిగా నమ్మకూడదు. వ్యక్తిని మొదటిసారి ఎప్పుడు నిర్బంధించారు, ఆ సమయం నుంచి 24 గంటలు దాటాయా లేదా అన్నది పరిశీలించాలి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 58ను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా 24 గంటలకు మించి ఒక వ్యక్తిని నిర్బంధించరాదనే నిబంధనను ఇది కొనసాగిస్తోంది. అంతేకాదు, 24 గంటల గడువు అనేది ఆ మొత్తం సమయం పాటు ఎవరినైనా నిర్బంధించేందుకు ఇచ్చిన అనుమతి కాదని కోర్టు పేర్కొంది.
గతంలో ఈ అంశంపై ఒరిస్సా, మద్రాస్, కేరళ హైకోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పుల్లో అధికారిక అరెస్టుకు ముందు నిర్బంధించిన సమయాన్ని మినహాయించేందుకు అవకాశం ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. ఒక వ్యక్తి స్వేచ్ఛను వాస్తవంగా ఎప్పుడు హరించారన్నదే కీలకమని స్పష్టం చేసింది. పోలీసు రికార్డుల్లో ఏ సమయం నమోదు చేశారన్నది రాజ్యాంగ హక్కులను నిర్ణయించలేదని ఈ తీర్పు మరోసారి గుర్తుచేసింది.

