Last Updated:
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్: మామిడి పంట సబ్సిడీ అర్హులైన రైతులకు చేరాలి. ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు ఆదేశం.
చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు చేసిన అర్హులైన ఒక్క రైతు కూడా ప్రభుత్వ సబ్సిడీకి దూరం కాకూడదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. రైతులకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకే చేరేలా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మామిడి పంట సేకరణ పురోగతి, సబ్సిడీ అమలు, రైతుల గుర్తింపు వంటి అంశాలపై ఆయన సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల స్థాయిలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) సిబ్బంది సంయుక్త బృందాలుగా ఏర్పడి గ్రామాల వారీగా మామిడి పంట సాగు చేసిన రైతులను గుర్తించాలని సూచించారు. కేవలం పత్రాలకే పరిమితం కాకుండా ప్రతి రైతు పొలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, పంట వాస్తవంగా సాగు చేశారా లేదా అనే అంశాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ అర్హులైన ప్రతి రైతుకు చేరేలా ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని స్పష్టం చేశారు.
మామిడి పంటకు సంబంధించిన వివరాలను ఈ-క్రాప్ నమోదుతో తప్పనిసరిగా సరిపోల్చాలని, అవసరమైతే భౌతిక పరిశీలన కూడా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఒకవేళ ఈ-క్రాప్‌లో నమోదు లేకపోయినా క్షేత్రస్థాయిలో పంట సాగు చేసినట్లు తేలితే, నిబంధనల మేరకు ఈ-క్రాప్ నమోదు పూర్తి చేసి రైతును అర్హుడిగా పరిగణించాలని చెప్పారు. అలాగే ఈ-క్రాప్‌లో నమోదు ఉండి, పొలంలో పంట కూడా ఉన్న రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతు పేరు ఈ-క్రాప్‌లో నమోదై ఉండి, ఆయన మరణించిన సందర్భాల్లో కూడా కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పంటను కుటుంబ సభ్యులే విక్రయించి ఉంటే మరణ ధ్రువీకరణ పత్రం, రెవెన్యూ శాఖ ధ్రువీకరణ, ఆధార్ తదితర ఆధారాలను పరిశీలించి నిబంధనల ప్రకారం సబ్సిడీ అర్హతను నిర్ణయించాలని అధికారులకు సూచించారు. అర్హత ఉన్న ఒక్క రైతు కూడా ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు.
అదే సమావేశంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించే దిశగా రైతులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పంటల సాగుకు అవసరమైన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా ముందస్తుగా అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, జిల్లా వ్యవసాయ అధికారి మురళి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వరన్, ఆర్టికల్చర్ అధికారి కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Chittoor,Chittoor,Andhra Pradesh

