Last Updated:
ఆమ్లెట్కు భిన్నంగా కాస్త కొత్త రుచిని ప్రయత్నించాలనుకునేవారు చట్నీ ఆమ్లెట్‌ను ట్రై చేయవచ్చు. ముందుగా కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, కరివేపాకుతో తయారు చేసిన చట్నీని గుడ్డులో కలిపి ఆమ్లెట్‌గా వేస్తారు. దీంతో స్పైసీగా, కొబ్బరి రుచితో మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. వంట చేయడం పెద్దగా రాకపోయినా గుడ్లు ఉంటే చాలు.. అందులో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి లేదా ఇతర పదార్థాలు కలిపి సులభంగా ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. సాధారణ ఆమ్లెట్కు భిన్నంగా కాస్త కొత్త రుచిని ప్రయత్నించాలనుకునేవారు చట్నీ ఆమ్లెట్‌ను ట్రై చేయవచ్చు. ముందుగా కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, కరివేపాకుతో తయారు చేసిన చట్నీని గుడ్డులో కలిపి ఆమ్లెట్‌గా వేస్తారు. దీంతో సాధారణ ఆమ్లెట్కు భిన్నంగా స్పైసీగా, కొబ్బరి రుచితో మంచి ఫ్లేవర్ వస్తుంది.
చట్నీ తయారు చేయడానికి ముందుగా ఒక కడాయి లేదా పాన్‌ను స్టవ్‌పై పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఐదు ఎండుమిరపకాయలు వేసి తక్కువ మంటపై వేయించాలి. వెల్లుల్లి, మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, చిన్న ఉసిరికాయ పరిమాణంలో చింతపండు వేసి సుమారు ఒక నిమిషం పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల పదార్థాల రుచి, వాసన మరింత బాగా వస్తాయి.
ఇప్పుడు ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. కొబ్బరిలోని పచ్చి వాసన పోయే వరకు తక్కువ మంటపై వేయించుకోవాలి. తర్వాత రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేయకుండా ముందుగా చల్లార్చడం మంచిది.
మిశ్రమం చల్లారిన తర్వాత ముందుగా నీళ్లు పోకుండా మిక్సీ జార్లో వేసి కొద్దిసేపు గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అవసరమైనంత నీరు కొద్దికొద్దిగా పోస్తూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చట్నీ తయారు చేసుకుంటే ఆమ్లెట్లో కలపడానికి సులభంగా ఉంటుంది. చట్నీ సిద్ధమైన తర్వాత ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల చట్నీ తీసుకుని అందులో ఒక గుడ్డు పగలగొట్టి వేయాలి. గుడ్డు, చట్నీ బాగా కలిసే వరకు బీట్ చేయాలి. రుచికి తగ్గట్టు కావాలంటే కొద్దిగా ఉప్పు లేదా కారం కూడా కలుపుకోవచ్చు.
ఇప్పుడు ఆమ్లెట్ పాన్‌ను స్టవ్‌పై పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత గుడ్డు, చట్నీ మిశ్రమాన్ని పాన్‌లో పోసి మెల్లగా గుండ్రంగా స్ప్రెడ్ చేయాలి. మంటను మీడియంగా ఉంచి ఒక వైపు బాగా ఉడికే వరకు వేచి చూడాలి. కింద భాగం సెట్ అయి అంచులు కొద్దిగా క్రిస్పీగా మారిన తర్వాత స్పాటులాతో జాగ్రత్తగా తిప్పాలి. రెండో వైపు కూడా సమంగా ఉడికే వరకు కాల్చాలి. రెండు వైపులా మంచి రంగు వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
వేడి వేడి చట్నీ ఆమ్లెట్‌ను అన్నం, రొట్టె, దోశ లేదా బ్రెడ్‌తో కూడా తినవచ్చు. చట్నీ ముందుగానే తయారు చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు త్వరగా ఆమ్లెట్ చేసుకోవచ్చు. అయితే గుడ్లను పూర్తిగా ఉడికించేలా చూసుకోవాలి. నూనెను కూడా ఎక్కువగా ఉపయోగించకుండా అవసరమైనంత మాత్రమే వేసుకుంటే రుచితో పాటు వంట కూడా సింపుల్‌గా ఉంటుంది. సాధారణ ఆమ్లెట్‌తో విసుగు వచ్చినప్పుడు ఈ చట్నీ ఆమ్లెట్‌ను ఒకసారి ప్రయత్నిస్తే ఇంట్లోనే కొత్త రుచిని ఆస్వాదించవచ్చు.

