స్వర్ణగిరి ఆలయ నమూనా గణేష్ మండపంలో ఎస్పీ ప్రత్యేక పూజలు.. ప్రశాంత నిమజ్జనానికి పిలుపు
ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 21:
కామారెడ్డి పట్టణంలో వాయిసేన యూత్ ఆధ్వర్యంలో స్వర్ణగిరి ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సోమవారం సందర్శించారు. మండపంలో కొలువుదీరిన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులతో ఎస్పీ మాట్లాడి గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీస్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేస్తూ, సంప్రదాయ వాయిద్యాలతో భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.నిమజ్జన సమయంలో భక్తులు, యువత అత్యుత్సాహానికి దూరంగా ఉంటూ తమ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో పోలీసులు, అధికారులు సూచించే భద్రతా నిబంధనలను పాటిస్తూ, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.గణేష్ నిమజ్జనం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచే విధంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. భక్తి, సంప్రదాయాలను గౌరవిస్తూ అందరూ క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఉత్సవాలు మరింత సంతోషకరమైన వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతే ముఖ్యమని, ఎవరూ తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఉత్సవాల్లో భక్తుల భద్రత, శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ కోరారు. నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరిస్తూ గణేష్ ఉత్సవాలను భక్తి, ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎస్. మధుసూదన్, టౌన్ ఎస్హెచ్ఓ బి. నరహరి, పోలీస్ సిబ్బంది, వాయిసేన యూత్ నిర్వాహకులు పాల్గొన్నారు.

