బ్యాంకు వినియోగదారుల భద్రతపై పోలీసుల అవగాహన సదస్సు
ఐదు మండలాల ఎస్‌ఐలు, వివిధ బ్యాంకుల అధికారులు హాజరు
హుజూర్‌నగర్, ప్రభ న్యూస్,అక్టోబర్ 16:
హుజూర్‌నగర్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులకు వినియోగదారుల భద్రత, ఆర్థిక మోసాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమంద రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హుజూర్‌నగర్ రూరల్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఎస్‌ఐలు, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా *డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమంద రాజు* మాట్లాడుతూ బ్యాంకు వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, ఆన్‌లైన్ ఆర్థిక మోసాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల ఖాతాదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.బ్యాంకు అధికారులు వినియోగదారులకు భద్రతాపరమైన సూచనలు అందించడంతో పాటు, అనుమానాస్పద లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల ఆర్థిక భద్రతను పరిరక్షించేందుకు పోలీసు శాఖ, బ్యాంకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.


