గుండ్లపోచమ్మ నుంచి పిలిపించి.. ఇనుప రాడ్తో దాడి? లింగంపేట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, ఓపో సెల్ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం
ప్రభ న్యూస్, కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 21:
లింగంపేట్ మండలంలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొరుపోలు గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలు (48)ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించినట్లు పోలీసులు పేర్కొన్న ఇనుప రాడ్, ఓపో సెల్ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొరుపోలు గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలుతో మృతురాలు గత పదేళ్లుగా సహజీవనం చేస్తూ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. హైదరాబాద్లోని గుండ్లపోచమ్మ వద్ద ఉన్న సమయంలో సాయిలు తన గ్రామానికి రావాలని ఆమెను పలుమార్లు ఫోన్లో బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలో సెప్టెంబర్ 18న భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లాల్సి ఉందని చెప్పడంతో ఆమె గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరింది. అనంతరం నాగారం గ్రామ శివారులో తలకు తీవ్ర గాయాలతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు లింగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.పోలీసుల వివరాల ప్రకారం.. భూమికి సంబంధించిన డబ్బుల విషయమై మృతురాలిని కామారెడ్డికి తీసుకెళ్లి జుబేర్తో మాట్లాడించిన అనంతరం తిరిగి పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మాట్లాడుకుంటున్న సమయంలో నిందితుడు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్తో మృతురాలిపై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది.నిందితుడు గుట్టమీది సాయిలును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజా రెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. దర్యాప్తును పూర్తి చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

