డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, మెసేజ్‌లతోనే ఎక్కువ సమయం గడుపుతున్న రోజుల్లో.. చేతితో ఉత్తరాలు రాసే పాత అలవాటును మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం ఇది. ఇండియా పోస్ట్, ఇండిగో కలిసి ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, విమానంలో 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నవారు కాసేపు స్క్రీన్లకు దూరంగా ఉండి, తమ మనసులోని మాటలను పోస్ట్‌కార్డులపై రాశారు. నేషనల్ పోస్టల్ వీక్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించింది. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండిగోతో కలిసి అక్టోబర్ 12న ఈ ప్రత్యేక డిజిటల్ డీటాక్స్ క్యాంపెయిన్‌ను నిర్వహించింది. నేషనల్ పోస్టల్ వీక్ అక్టోబర్ 9 నుంచి 15 వరకు జరుగుతోంది. ఈ వారంలో అక్టోబర్ 12న ఫిలాటెలీ డేను జరుపుకున్నారు. (image: India Post)

