[Categroy తెలంగాణ]
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా..

కాంగ్రెస్ నల్ల బ్యాడ్జీల నిరసన.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
ప్రభ న్యూస్ మంచిర్యాల్ జిల్లా రామకృష్ణాపూర్ జులై 22:
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, పోటీ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిర్వహణ లోపాలు,ఈ అంశంపై నిలదీసిన ప్రజాప్రతినిధుల అరెస్టులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ,ఏటా అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పే పాలకులు, తీరా పరీక్షల నిర్వహణ వచ్చేసరికి చేతులెత్తేసారని మండిపడ్డారు.రాత్రింబవళ్లు కష్టపడి చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తే అరెస్టులా..
చట్టసభల్లో విద్యార్థుల భవిష్యత్తు కోసం గళమెత్తి, ప్రశ్నాపత్రాల లీకేజీపై పూర్తిస్థాయి చర్చకు పట్టుబట్టిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం అని ఆరోపించారు.
పరీక్షల నిర్వహణలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.జాతీయ స్థాయి పరీక్షలలో జరిగిన అన్ని అవకతవకలపై నిష్పాక్షికమైన విచారణ జరిపించాలి.పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి, విద్యార్థులకు నమ్మకం కలిగించాలి.తక్షణమే చట్టసభలలో లీకేజీల అంశంపై సమగ్ర చర్చ జరపాలి.విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, కూతురు ప్రభాకర్, నాయకులు మాజీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, యాకుబ్ అలీ, పనాస రాజు, ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, మొట్టె సుధాకర్, పుల్లూరి కళ్యాణ్, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, గోపు రాజం, మేకల సురేందర్, ఏల్పుల సత్యనారాయణ, ఎర్రబెల్లి రాజేష్, పైడాకుల శ్రీనివాస్, వనం యాదగిరి, మహిళా నాయకురాలు రాజేశ్వరి,దీప,పుష్ప అనూష ,లక్ష్మి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
