మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో రిస్క్‌ను నియంత్రించుకుంటూ పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (SIF) విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఏఎంఎఫ్ఐ గణాంకాల ప్రకారం, ఈ విభాగంలోని పెట్టుబడుల విలువ అక్టోబర్ 2025లో సుమారు రూ.2,010 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ 2026 నాటికి రూ.38,287 కోట్లకు చేరింది. ఇందులో హైబ్రిడ్ లాంగ్-షార్ట్ వ్యూహాలకు మంచి ఆదరణ లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ, సీఈఓ నవనీత్ మునోట్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా రిస్క్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యమిస్తూ హెచ్-ఎస్ఐఎఫ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈక్విటీలు, డెరివేటివ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగాల్లో అనుభవం ఉన్న నిపుణుల బృందం ఈ ఫండ్‌ను నిర్వహిస్తుందని చెప్పారు.
హెచ్-ఎస్ఐఎఫ్ హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్‌ను ‘ఆర్బిట్రేజ్ ప్లస్’ వ్యూహంతో రూపొందించారు. ఇందులో ప్రధానంగా డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్బిట్రేజ్ అవకాశాలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (InvITs)లో పెట్టుబడులు పెడతారు. వీటికి అదనంగా డెరివేటివ్స్ ద్వారా పెట్టుబడులపై రిస్క్ తగ్గించేందుకు హెడ్జింగ్ చేస్తారు. ఆప్షన్ ప్రీమియంల ద్వారా ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తారు. అలాగే, ఫండ్ నెట్ అసెట్స్‌లో గరిష్ఠంగా 25 శాతం వరకు షార్ట్ పొజిషన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఐపీఓలు, షేర్ బైబ్యాక్‌లు, ఓపెన్ ఆఫర్లు, కంపెనీల విలీనాలు వంటి ప్రత్యేక కార్పొరేట్ పరిణామాల్లోనూ పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తారు.
ఈ ఫండ్ కేవలం మార్కెట్ పెరుగుదలపైనే ఆధారపడకుండా, డెట్ పెట్టుబడులపై వడ్డీ ఆదాయం, ఆర్బిట్రేజ్ స్ప్రెడ్స్, ఆప్షన్ ప్రీమియంలు, ప్రత్యేక పెట్టుబడి అవకాశాల ద్వారా రాబడి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ పెద్దగా కదలకుండా ఉన్నప్పుడు, స్వల్పంగా పెరుగుతున్నప్పుడు లేదా ఒడుదొడుకులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ వ్యూహాన్ని రూపొందించారు. అయితే, పెట్టుబడిదారులకు 18 నెలలకు మించిన ఇన్వెస్ట్మెంట్ వ్యవధి ఉండటం మంచిదని సూచించారు.
మార్కెట్ ఒడుదొడుకుల్లోనూ అవకాశాలు
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఈక్విటీ ఫండ్ మేనేజర్ పాల్ ఎస్. పరంప్రీత్ మాట్లాడుతూ.. మార్కెట్ ఒడుదొడుకులు పెరిగినప్పుడు వాటిని ఉపయోగించుకునే పెట్టుబడి వ్యూహాలకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఒకే రకమైన పెట్టుబడిపై ఆధారపడకుండా, వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందేలా పోర్ట్‌ఫోలియోను రూపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రధాన పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందిస్తాయని, డెరివేటివ్స్ ద్వారా రిస్క్‌ను నియంత్రించవచ్చని వివరించారు.
హెచ్-ఎస్ఐఎఫ్ హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్ నిర్వహణ బాధ్యతలను నలుగురు నిపుణులు చేపట్టనున్నారు. పాల్ ఎస్. పరంప్రీత్, ఇహాబ్ దల్వాయ్ ఈక్విటీ పెట్టుబడులను పర్యవేక్షిస్తారు. అనిల్ బాంబోలి డెట్ విభాగాన్ని నిర్వహిస్తారు. గోపాల్ అగర్వాల్ విదేశీ పెట్టుబడుల బాధ్యతలు చూస్తారు.
కనీస పెట్టుబడి ఎంతంటే?
ఈ ఎస్ఐఎఫ్ వ్యూహంలో పాన్ కార్డు స్థాయిలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. అయితే, నిబంధనలకు అనుగుణంగా గుర్తింపు పొందిన అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లకు కనీస పెట్టుబడి రూ.10,000గా ఉంటుంది. ఇందులో ప్రతిరోజూ పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే, ప్రతి సోమవారం, బుధవారం మాత్రమే రిడెంప్షన్లకు అవకాశం ఉంటుంది. యూనిట్లు కేటాయించిన తేదీ నుంచి 90 రోజుల్లోపు వెనక్కి తీసుకున్నా లేదా మరో ఫండ్‌కు మార్చుకున్నా 0.5 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాలి. 90 రోజుల తర్వాత ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు.
పెట్టుబడి పెట్టే ముందు ఇవి తెలుసుకోండి
ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ముందు దాని వ్యూహాలు, నిబంధనలు, రిస్కులను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇందుకోసం సంస్థ అధికారిక వెబ్సైట్ https://hsif.hdfcfund.com/ లోని ప్రొడక్ట్ లిటరేచర్ను పరిశీలించవచ్చు. ఈ పెట్టుబడి వ్యూహాన్ని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లేదా రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయాలని ప్రతిపాదించారు. అయితే, ఎక్స్ఛేంజీల లిస్టింగ్ అనుమతి ఇచ్చినంత మాత్రాన ఫండ్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (ISID)లోని వివరాలను అవి పరిశీలించి ఆమోదించినట్లు కాదు. పెట్టుబడిదారులు అందులోని పూర్తి డిస్‌క్లెయిమర్‌ను చదవాలి.
ముఖ్యంగా, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంలో కొంత లేదా మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే, అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే లిక్విడిటీ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి, కేవలం రాబడి అవకాశాలను చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోకుండా, ఫండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను చదివి, రిస్కులను అర్థం చేసుకున్న తర్వాత ఆర్థిక సలహాదారుల సూచనతో నిర్ణయం తీసుకోవాలి.
