Last Updated:
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని సెవెన్ లేక్ వ్యూ హోటల్‌లో ‘బాద్మాష్ పొట్టే’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు, నటుడు షిరాజ్ మెహదీ.. టాలీవుడ్‌లో కొనసాగుతున్న గుత్తాధిపత్యం (Monopoly), బంధుప్రీతి (Nepotism) పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని సెవెన్ లేక్ వ్యూ హోటల్‌లో ‘బాద్మాష్ పొట్టే’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు, నటుడు షిరాజ్ మెహదీ.. టాలీవుడ్‌లో కొనసాగుతున్న గుత్తాధిపత్యం (Monopoly), బంధుప్రీతి (Nepotism) పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు జరుగుతున్న అన్యాయంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి.
చిత్ర పరిశ్రమలో కేవలం కొందరి చేతుల్లోనే థియేటర్లు, పంపిణీ వ్యవస్థ ఉండటం వల్ల ప్రతిభ ఉన్న కొత్తవారు, చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని షెరాజ్ మెహదీ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన థియేటర్లు దొరకక చిన్న సినిమాలు పడుతున్న కష్టాలపై తాను గత ఏడాదిన్నరగా అలుపెరగని పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రముఖ మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు, ఫిల్మ్ చాంబర్‌కు సైతం ఇప్పటికే తుది నోటీసులు జారీ చేసినట్లు ఆయన బాంబు పేల్చారు. తన న్యాయ పోరాటం ఇప్పటికే 90 శాతం పూర్తయిందని, చిన్న సినిమాలకు సరైన న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
సినిమాలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, కళపై ఉన్న ప్యాషన్‌తో నిర్మించాలని నిర్మాతలకు ఆయన సూచించారు. అయితే, ఎంతో కష్టపడి సినిమా తీసిన తర్వాత నష్టాలు వస్తే నిర్మాత రోడ్డున పడే పరిస్థితి ఉందని, దీనికి పరిష్కారంగా ప్రభుత్వాలు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి, సినిమా విడుదలయ్యాక నష్టాలు వస్తే కనీసం 20 నుంచి 30 శాతం వరకు రికవరీ అయ్యేలా ఓ ప్రత్యేక సబ్సిడీ విధానాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే, కేవలం రెగ్యులర్ తెలుగు సినిమాలకే కాకుండా, హైదరాబాద్ సంస్కృతి, స్థానికత ఉట్టిపడేలా తెరకెక్కే దక్కనీ/హైదరాబాదీ సినిమాలకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు అందించాలని కోరారు.
ఇక ‘బాద్మాష్ పొట్టే’ సినిమా గురించి మాట్లాడుతూ.. దర్శకుడు ఫరూఖ్ ఖాన్ పనితీరును, సినిమా పట్ల అతనికి ఉన్న డెడికేషన్ ను మెచ్చుకున్నారు. ఫరూఖ్ ఖాన్ లాంటి ప్యాషన్ ఉన్న దర్శకులు ఇండస్ట్రీకి ఎంతో అవసరమని, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ కేంద్రంగా వస్తున్న ఇలాంటి విభిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు, నటీనటులు పాల్గొన్నారు.

