Last Updated:
మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రూపొందుతున్న వారణాసి మూవీ గురించి ఓ తాజా న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో జక్కన్న ప్లాన్ మారిందని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి ఫిల్మ్ నగర్‌లో ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మారబోతోందంటూ టాలీవుడ్ వర్గాల్లో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.
సాధారణంగా రాజమౌళి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడం ఎంత కామనో.. రిలీజ్ డేట్లు వాయిదా పడటం కూడా అంతే కామన్. ప్రతి ఫ్రేమ్‌ను పర్ఫెక్ట్‌గా చెక్కే జక్కన్న.. ఈ చిత్రం కోసం భారీ వీఎఫ్ఎక్స్ (VFX), అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పనుల దృష్ట్యా ముందుగా అనుకున్న ఏప్రిల్ 7వ తేదీ నాటికి సినిమా పనులు పూర్తికావడం కష్టమేనని, అందుకే రిలీజ్ డేట్ మారనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో, రాజమౌళి కన్ను మరో భారీ పాన్ ఇండియా స్లాట్‌పై పడినట్లు తెలుస్తోంది. ఆ స్లాట్ మరేదో కాదు.. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణ పార్ట్ 2’ వదిలేసిన దీపావళి సీజన్.
ఇండియన్ సినిమా నుంచి గ్లోబల్ స్థాయిలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘రామాయణ’, ‘వారణాసి’ ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ‘రామాయణ పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. అయితే, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘రామాయణ పార్ట్ 2’ను 2027 దీపావళికి విడుదల చేయాల్సి ఉండగా.. మేకర్స్ దాన్ని ఏడాది పాటు వాయిదా వేస్తూ 2028 దీపావళికి అధికారికంగా షిఫ్ట్ చేశారు. దీంతో 2027 దీపావళికి పాన్ ఇండియా మార్కెట్‌లో ఒక అతిపెద్ద స్లాట్ ఖాళీ అయింది.
ఏప్రిల్ 7వ తేదీన వారణాసి పనులు పూర్తవ్వకపోతే, ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఖాళీ అయిన 2027 దీపావళి స్లాట్‌ను రాజమౌళి లాక్ చేసుకునే ఆలోచనలో ఉన్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. పండుగ సీజన్‌లో ఇలాంటి గ్లోబల్ మూవీ రిలీజ్ అయితే వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. మరి ఈ రిలీజ్ డేట్ మార్పు రూమర్లలో ఎంతవరకు నిజముందో.. జక్కన్న టీమ్ పాత తేదీనే ఫైనల్ చేసుకుంటుందో, లేక కొత్త డేట్ ప్రకటిస్తుందో చూడాలి.

