Last Updated:
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఇతర పోటీ దేశాల కంటే భారత్‌కు మెరుగైన టారిఫ్ ప్రయోజనం కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు తొలి దశ ఒప్పందాన్ని పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగంగా కొనసాగుతున్న వేళ వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీకి కీలక హామీ లభించింది. ఈ ఒప్పందంలో ఇతర పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌కు మెరుగైన టారిఫ్ ప్రయోజనం (పన్ను రాయితీలు) కల్పిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే తుది టారిఫ్ విధానం ఎలా రూపుదిద్దుకుంటుందో వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారత్‌పై ప్రారంభించిన రెండో విచారణ ఫలితంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
విస్తృత స్థాయి వాణిజ్య ఒప్పందాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా పూర్తి చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. దీనివల్ల ప్రారంభ దశలోనే కీలక పురోగతి సాధించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ వాణిజ్య ఒప్పందంలో తొలి విడత ప్యాకేజీని కొలిక్కి తీసుకురావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి ప్యాకేజీతో పాటు విస్తృత ఒప్పందంపై ఒకేసారి సమాంతరంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రారంభ ప్యాకేజీలో సేవల రంగానికి (సర్వీసెస్) సంబంధించిన అంశాలు ఉండవని, వాటిని రెండో దశలో చేర్చి సమగ్ర ఒప్పందంలో భాగంగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. తుది ఒప్పందం అనుబంధాలతో కూడిన చట్టపరమైన రూపంలో ఉంటుందని, ఇందులో కస్టమ్స్, వాణిజ్య సులభతరం కోసం ప్రత్యేక అధ్యాయం ఉంటుందని వివరించారు.
మరోవైపు కస్టమ్స్, వాణిజ్య సులభతరం అంశాలపై భారత్, అమెరికా అధికారులు గత వారం కీలక చర్చలు జరిపారని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం నవంబర్ 2, 3 తేదీల్లో భారత్‌లో పర్యటించింది. ప్రపంచ వాణిజ్య అనిశ్చితి నేపథ్యంలో ఈ ఒప్పందం భారత ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనుంది.

