ముందుచూపే కుటుంబానికి అండగా నిలిచింది.. ప్రమాదంలో మృతి చెందిన ఖాతాదారుడి కుటుంబానికి ఎస్‌బీఐ ద్వారా రూ.40 లక్షల బీమా
ప్రభ న్యూస్ శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ::
ఒక ప్రమాదం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టినా, ముందుచూపుతో తీసుకున్న బీమా పాలసీ ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలిచింది. మెళియాపుట్టి మండలంలోని కోసమాల గ్రామానికి చెందిన ఎస్‌బీఐ చాపర శాఖ ఖాతాదారుడు ముల్లి చంద్రరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన తీసుకున్న ఎస్‌బీఐ జనరల్ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ద్వారా నామినీకి రూ.40 లక్షల బీమా మొత్తాన్ని అందజేశారు.ముల్లి చంద్రరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాపర శాఖలో ఖాతా నిర్వహిస్తూ, సంవత్సరానికి రూ.2,000 ప్రీమియంతో ఎస్‌బీఐ జనరల్ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలో చేరారు. అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే, ఆయన ముందుగానే తీసుకున్న బీమా పాలసీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది.ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎస్‌బీఐ చాపర శాఖ అధికారులు అవసరమైన పత్రాలను సేకరించి బీమా క్లెయిం ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశారు. అనంతరం ఎస్‌బీఐ జనరల్ మంజూరు చేసిన రూ.40 లక్షల బీమా చెక్కును మృతుడి భార్య, నామినీ ముల్లి విజయలక్ష్మికి అందజేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌బీఐ బొబ్బిలి రీజినల్ మేనేజర్ ఎం. రమేష్ నాయుడు బీమా చెక్కును అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో ఎవరూ ఊహించలేరని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించేది బీమా పథకాలేనని అన్నారు.
ప్రతి ఖాతాదారుడు తన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ జనరల్ అందిస్తున్న వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు ఇతర బీమా పథకాలలో చేరాలని ఆయన సూచించారు. తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ పొందే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎస్‌బీఐ చాపర శాఖ మేనేజర్ రవ్వ రవితేజ, ఎస్‌బీఐ జనరల్ ప్రతినిధులు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు బీమా క్లెయిం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి ఆర్థికంగా అండగా నిలిచిన ఎస్‌బీఐ చాపర శాఖ, ఎస్‌బీఐ జనరల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

