Last Updated:
న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ ఇప్పుడు ఓటీటీ లోకి వస్తోంది. కొన్ని సీన్స్ కట్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఆ వివరాలు చూస్తే..
న్యాచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ, సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అదే క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా కావడంతో, దీనిపై ట్రేడ్ వర్గాల్లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎల్.వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇంతటి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయింది.
వాస్తవానికి ఈ సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే, టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసేది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా ‘ది ప్యారడైజ్’ నిలిచేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ దాదాపు 3 గంటల భారీ రన్ టైమ్ ఉండటం, కథనంలో కాస్త సాగతీత, కొన్ని అనవసరమైన ఓవర్ యాక్షన్ సీన్స్ సినిమాకు మైనస్ అయ్యాయి. నాని తన అద్భుతమైన నటనతో, అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేసినప్పటికీ, కొన్ని లోపాల వల్ల బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టలేకపోయింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ‘ది ప్యారడైజ్’ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో సినిమా అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది.
అయితే థియేటర్లలో జరిగిన తప్పులను మేకర్స్ ఓటీటీ వెర్షన్ కోసం సరిదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. థియేట్రికల్ వెర్షన్ 3 గంటల రన్ టైమ్‌తో రాగా, ఓటీటీలో మాత్రం రన్ టైమ్‌ను భారీగా తగ్గించారు. ఒరిజినల్ సినిమా నుంచి దాదాపు 25 నిమిషాల నిడివిని కట్ చేసి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. ప్రేక్షకులకు విసుగు తెప్పించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అనవసరమైన పాటలను తొలగించి సినిమాను మరింత ఆసక్తికరంగా, క్రిస్ప్‌గా మలిచారని టాక్ నడుస్తోంది. ఈ ట్రిమ్మింగ్ నిర్ణయం వల్ల సినిమా పేస్ పెరిగి, ఓటీటీలో ‘ది ప్యారడైజ్’కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుందని యూనిట్ భావిస్తోంది. మరి ఈ 25 నిమిషాల కట్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈనెల 22 వరకు వేచి చూడాల్సిందే.

