Last Updated:
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ 99వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు. దేశ నిర్మాణంలో ఆయన పాత్రను, వాజ్‌పేయితో ఉన్న అనుబంధాన్ని, చారిత్రక రథయాత్ర నాటి జ్ఞాపకాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు.
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 8, 1927న కరాచీలో జన్మించిన అద్వానీ ఆదివారంతో 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ‘ఇండియా టుడే’ పత్రికలో ప్రధాని మోదీ ఒక సుదీర్ఘ వ్యాసం రాశారు. ఆధునిక భారత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలతో ముడిపడి ఉన్న అరుదైన నాయకుడిగా అద్వానీని ప్రధాని అభివర్ణించారు.
1947 దేశ విభజన సమయంలో సింధ్ ప్రాంతం విడిచిపెట్టి శరణార్థిగా భారతదేశానికి వచ్చి, సున్నా నుంచి జీవితాన్ని పునర్నిర్మించుకున్న అద్వానీ ధైర్యం ఆయన ప్రజాజీవితానికి బలమైన పునాదిగా మారిందని కొనియాడారు. జనసంఘ్ స్థాపన నాటి నుంచి బీజేపీ జాతీయ స్థాయికి ఎదగడం వెనుక ఆయన అపారమైన కృషి, క్రమశిక్షణ దాగి ఉన్నాయని ప్రధాని ప్రస్తుతించారు.
జాతీయ రాజకీయాల్లో బీజేపీ ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించడంలో అద్వానీ అత్యంత కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అద్వానీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 1996లో పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ తొలిసారి అవతరించింది. పార్టీ కోసం లక్షలాది మంది కార్యకర్తలను తీర్చిదిద్ది, “దేశమే ప్రథమం” అనే సిద్ధాంతాన్ని పునాదిగా మార్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో అద్వానీకి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల పాటు కలిసి పనిచేసినప్పటికీ వారిద్దరి మధ్య ఎన్నడూ వ్యక్తిగత హోదా వివాదాలు లేదా పోటీ భావన రాలేదని, రాజకీయాల్లో సీనియర్ నేతలు ఎలా సమన్వయంతో ఉండాలో ఈ ద్వయం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
1991 లోక్‌సభ ఎన్నికల సమయంలో గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి అద్వానీ పోటీ చేసినప్పుడు ఆయన నామినేషన్ పత్రాలను స్వయంగా సిద్ధం చేసి, ప్రచార బాధ్యతల్లో తాను దగ్గరుండి పాల్గొన్న రోజులను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గాంధీనగర్ ఓటరుగా తాను పలుమార్లు అద్వానీకి ఓటు వేయడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. అలాగే భారత రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన సోమనాథ్ నుంచి అయోధ్య వరకు సాగిన చారిత్రక రామ రథయాత్ర ప్రణాళిక రూపకల్పన, నిర్వహణలో తాను భాగస్వామి కావడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. వేలాది కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరిచిన అద్వానీ శారీరక దృఢత్వం, కార్యదీక్ష అపూర్వమని కొనియాడారు.
1975 నాటి చీకటి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) రోజుల్లో అద్వానీ జైలు జీవితం గడిపిన సందర్భాలను మోదీ గుర్తుచేశారు. ఆ తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతా పార్టీ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఆయన పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించారు. అనంతరం వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా, ఉప ప్రధానిగా దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో అద్వానీ విశేష ముద్ర వేశారు. అంతర్గత భద్రతను కాపాడటంలో, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడంలో రాజీలేని వైఖరిని ప్రదర్శించారని ప్రధాని ప్రశంసించారు.
అద్వానీ శతాబ్ది వసంతంలోకి అడుగుపెడుతున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలు, హోమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆయన జీవిత చరిత్ర, చారిత్రక ప్రసంగాలు, రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ వీడియోను ప్రదర్శించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తదితర ప్రముఖులు హాజరై ప్రసంగించారు. అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తన తండ్రి జీవన ప్రస్థానంపై జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు అద్వానీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాయి.

