Last Updated:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. అయితే మోదీకి దీపావళి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులతో కలిసి వేడుకలు జరుపుకోవడం కూడా ఒక ప్రత్యేక సంప్రదాయంగా మారింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8, ఆదివారం దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అంటూ మోదీ పోస్టు చేశారు. పండుగ వేళ ప్రజలంతా ఆనందంగా, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీకి దీపావళి సందర్భంగా సైనికులను కలుసుకోవడం ఒక ప్రత్యేక సంప్రదాయంగా మారింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు ప్రతి ఏడాది సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంప్రదాయాన్ని ఆయన సియాచిన్ బేస్ క్యాంప్‌లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సైనిక స్థావరాల్లో ఒకటైన సియాచిన్‌లో జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్నారు.
ఆ తర్వాత కూడా వివిధ వ్యూహాత్మక ప్రాంతాలకు వెళ్లి సైనికులతో పండుగను జరుపుకున్నారు. 2015లో అమృత్‌సర్ సమీపంలోని పంజాబ్ సెక్టార్‌లో, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లో చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న సుమ్‌దోహ్‌లో వేడుకల్లో పాల్గొన్నారు. 2017లో జమ్మూకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌కు వెళ్లారు. 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌లో, 2019లో నియంత్రణ రేఖ సమీపంలోని రాజౌరిలో జవాన్లతో గడిపారు.
2020లో రాజస్థాన్‌లోని లోంగేవాలా, 2021లో జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా, 2022లో కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2023లో హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో జవాన్లను కలిశారు. 2024లో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఉన్న సర్ క్రీక్‌కు వెళ్లారు. 2025లో గోవా-కార్వార్ తీరానికి సమీపంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు.
ఈ పర్యటనల్లో మోదీ సైనికులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు. పండుగ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు స్వీట్లు పంచుకుంటారు. దేశ ప్రజలు కుటుంబ సభ్యులతో దీపావళి జరుపుకుంటున్న సమయంలో సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల సేవలను అభినందిస్తారు. జవాన్లకు అండగా నిలవడం, వారి త్యాగాలను గుర్తించడం ఈ సంప్రదాయం వెనుక ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతోంది.

