Last Updated:
Uttarakhand bus accident: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో పెను విషాదం చోటుచేసుకుంది. తెహ్రీ గర్వాల్ జిల్లాలోని గులార్ బజార్ సమీపంలో మంగళవారం ఉదయం ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి దాదాపు 100 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నారు. గులార్ బజార్ సమీపంలోని వంతెన వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి వంద మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే బయాసి (Byasi), ధల్వాలా (Dhalwala) ప్రాంతాల్లో ఉన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. లోయలో చిక్కుకున్న వారిలో సుమారు 20 మంది క్షతగాత్రులను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు, ప్రమాద తీవ్రత దృష్ట్యా తెహ్రీ గర్వాల్ జిల్లా మేజిస్ట్రేట్ నితికా ఖండేల్వాల్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) శ్వేతా చౌబే కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

