Last Updated:
ఉసిరికాయ రుచి పుల్లగా ఉండటంతో కొంతమంది పిల్లలు నేరుగా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వాటితో రుచికరమైన పులిహోర తయారు చేసి పెడితే ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది.
చలికాలంలో మార్కెట్లో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో విటమిన్ సి, పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఉసిరికాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే ఉసిరికాయ రుచి పుల్లగా ఉండటంతో కొంతమంది పిల్లలు నేరుగా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వాటితో రుచికరమైన పులిహోర తయారు చేసి పెడితే ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. చింతపండు పులిహోరకు భిన్నంగా ఉండే ఈ ఉసిరికాయ పులిహోర పులుపు, కారం, కమ్మదనం కలిసిన ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. లంచ్ బాక్స్‌లలో పెట్టడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి కూడా ఇది మంచి ఎంపిక.
ఈ పులిహోర తయారు చేయడానికి ఒక గ్లాసు బియ్యం, ఆరు మీడియం సైజు ఉసిరికాయలు, తగినంత ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అవసరం. అలాగే శనగపప్పు, మినప్పప్పు ఒక్కో టేబుల్ స్పూన్, ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు, మూడు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, రెండు రెమ్మల కరివేపాకు, నాలుగు పచ్చిమిర్చి, అర టీస్పూన్ ఇంగువ, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి.
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర నుంచి ఒకటిముప్పావు గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి అన్నం పొడిపొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత వెడల్పాటి పళ్లెంలోకి తీసి చల్లారనివ్వాలి. తర్వాత ఉసిరికాయలను కడిగి గింజలు తొలగించి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని మిక్సీలో వేసి ఉప్పు, పసుపు కలిపి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు కడాయిలో ధనియాలు, నువ్వులు విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడిగా చేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేడి చేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇందులో ఇంగువ, ఉసిరికాయ ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అనంతరం ధనియాలు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి.
చివరగా చల్లారిన అన్నాన్ని వేసి మసాలా అంతా సమంగా పట్టేలా కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు సరిచూసుకుని కొత్తిమీర చల్లాలి. అంతే.. రుచికరమైన ఉసిరికాయ పులిహోర సిద్ధం. తయారైన తర్వాత కొద్దిసేపు ఉంచితే మసాలా రుచులు అన్నంలో బాగా కలుస్తాయి. పెరుగు లేదా పాపడాలతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.

