డిజిటల్ పేమెంట్ సేవలకు వినియోగదారులు, చిన్న వ్యాపారులపై తక్కువ మొత్తంలో ఛార్జీలు విధించడం ద్వారా బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (పీఎస్‌పీలు), డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను నడిపించే సంస్థలకు ఇది సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. “పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏలో ఉన్న ‘ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961లోని సెక్షన్ 269ఎస్‌యూ కింద సూచించిన ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలు’ అనే పదాల స్థానంలో, కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలు అనే పదాలను చేర్చాలి” అని బిల్లులో పేర్కొన్నారు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏ ప్రకారం బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ సంస్థలు ఎలక్ట్రానిక్ పేమెంట్లపై ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. మరోవైపు ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 269ఎస్‌యూ ప్రకారం రూ.50 కోట్లకు మించి టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారాలు కొన్ని నిర్దిష్ట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలను అంగీకరించాలి. ఇందులో రూపే డెబిట్ కార్డులు, భీమ్-యూపీఐ క్యూఆర్ కోడ్‌లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
