Last Updated:
థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నాని ది ప్యారడైజ్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ ఓటీటీ వర్షన్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వెండితెరపై ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం తీవ్రంగా తడబడింది. థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ఇప్పుడు అందరి దృష్టీ ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్‌పై పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 23న ‘ది ప్యారడైజ్’ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
అయితే, ఈ ఓటీటీ రిలీజ్ కోసం మేకర్స్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. విడుదలైన మొదటి ఆట నుంచే ‘ది ప్యారడైజ్’ మిక్స్‌డ్ టాక్‌తో పాటు తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. ఫస్టాఫ్ కాస్త పర్వాలేదనిపించినా, సెకండాఫ్ పూర్తిగా దారితప్పడం, కథనంలో భారీ సాగదీత ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. ఎడిటింగ్‌లో లోపాల వల్ల సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అవ్వడంతో జనం కథలో లీనం కాలేకపోయారు. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాని కూడా ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. రిలీజ్ హడావిడిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు, ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్‌పై సరైన సమయం కేటాయించలేకపోయామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో వయొలెన్స్ పాళ్లు శృతిమించడం, గర్భిణులపై చూపించిన అతి క్రూరమైన రక్తపాత సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేశాయి. దీనికి తోడు డబ్బు కోసం హీరోయిన్ బీ-గ్రేడ్ సినిమాల్లో నటించడం, ఆ సన్నివేశాలను స్వయంగా కన్నతల్లే చిత్రీకరించడం వంటి ట్రాక్ తీవ్ర వివాదాస్పదమైంది. దర్శకుడు యాక్షన్‌కు ఇచ్చిన ప్రాధాన్యత ఎమోషన్స్‌కు ఇవ్వకపోవడం సినిమాకు అతిపెద్ద మైనస్‌గా మారింది.
సాధారణంగా థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న చిత్రాలు అనేకం ఉన్నాయి. సరిగ్గా ఈ సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకునే నాని అండ్ టీమ్ ఓటీటీ కోసం సరికొత్త వ్యూహాన్ని రచించారు. ఓటీటీలోనూ థియేట్రికల్ నెగిటివ్ టాక్ పునరావృతం కాకుండా ఉండేందుకు ఏకంగా సినిమాను రీ-ఎడిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై తీవ్ర విమర్శల పాలైన అసభ్యకర సన్నివేశాలు, మితిమీరిన హింసను డిజిటల్ వెర్షన్ నుంచి పూర్తిగా తొలగిస్తున్నారని సమాచారం. వాటి స్థానంలో థియేట్రికల్ కట్ సమయంలో నిడివి సమస్యల వల్ల పక్కనపెట్టిన మంచి ఫీల్-గుడ్ ఎమోషనల్ సన్నివేశాలను, ఒక పాటను జోడించి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నారట. డిజిటల్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా, కథనం వేగంగా సాగేలా ఒక రకమైన ‘డైరెక్టర్స్ కట్’ను నెట్‌ఫ్లిక్స్‌కు అందించనున్నారు. నాని వేసిన ఈ ప్యాచ్‌వర్క్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయితే, థియేటర్లలో చేదు అనుభవాన్ని మిగిల్చిన ‘ది ప్యారడైజ్’ ఓటీటీ ప్రేక్షకులను బాగానే అలరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

