Last Updated:
టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో తొలి నోటీసు విడుదలయ్యే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాలు, బూత్ ఇన్చార్జ్ల వివరాలు ఎన్నికల అధికారికి అందించగా, ఎన్నికల అనంతరం ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
TGSRTC Union Elections: టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం (యూనియన్) ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమిషనర్ ఇటీవల టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాలను సమగ్రంగా పరిశీలించి, ప్రక్రియపై చర్చించారు. ఈ సమావేశంతో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.
ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన పోలింగ్ కేంద్రాల వివరాలు, ఆయా బూత్ల ఇన్చార్జ్ల జాబితాను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ఎన్నికల అధికారికి అందజేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్లో భాగంగా మరో రెండు నుంచి మూడు రోజుల్లో తొలి నోటీసు (ఫస్ట్ నోటీస్) విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణ అధికారి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా యాజమాన్యం, ఎన్నికల అధికారి మధ్య నిరంతర సమన్వయం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కూడా ఈ యూనియన్ ఎన్నికలతో ముడిపడి ఉంది. గుర్తింపు సంఘం ఎన్నికలు పూర్తయిన తర్వాతే విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
గత ఏప్రిల్లో జరిగిన ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చల్లో యూనియన్ నాయకులు మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు. వాటిలో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఉన్నాయి. విలీన అంశాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ప్రతి కార్మికుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో విజయం సాధించిన గుర్తింపు సంఘాన్ని ప్రభుత్వ విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వామిగా తీసుకుంటారు. గెలిచిన యూనియన్ నాయకులు ఇచ్చే సూచనలు, సలహాల ఆధారంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana

