Last Updated:
Sheikh Hasina: రెండేళ్లకు పైగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల డిసెంబర్ 16న తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.
ఏటా డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘విక్టరీ డే’ వేడుకలు నిర్వహిస్తారు. సరిగ్గా అదే రోజును తన పునరాగమనానికి హసీనా ఎంచుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో చెలరేగిన తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, హసీనా బంగ్లాదేశ్ విమానంలోనే భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరిగి ఢిల్లీ నుండి తనను ఢాకాకు తీసుకెళ్లడానికి ‘బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్’ (Biman Bangladesh Airlines) విమానాన్ని పంపాలని ఆమె ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై హసీనా సహాయకుడు సయ్యద్ మొజమ్మెల్ అలీ స్పందిస్తూ.. 2024లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమెను దేశం నుండి బహిష్కరించారని ఆరోపించారు. కాబట్టి డిసెంబర్ 16న విక్టరీ డే రోజున ఆమె అత్యంత గౌరవప్రదంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.
స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు హసీనా కొంతకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (NID) జారీ చేయాలని ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మరోవైపు, హసీనాను స్వదేశానికి పంపాలంటే బంగ్లాదేశ్ తమ సైనిక విమానాన్ని పంపాలని లేదా ఇరుదేశాల భూ సరిహద్దు మార్గంలో పొరుగు దేశ సైన్యం ఆమెను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలని భారత్ షరతులు విధించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
హసీనా ప్రకటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఒకవేళ హసీనా తిరిగి దేశంలో అడుగుపెడితే ఆమెను కచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు తేల్చిచెప్పాయి. అంతేకాకుండా, ఆమెను తీసుకురావడానికి విమానాన్ని పంపే విషయంపై భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. హసీనా రాక ప్రకటన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

