Last Updated:
2025వ సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక కమిటీకి చైర్మన్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2025వ సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక కమిటీకి చైర్మన్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి, నటి ప్రభలను కమిటీ సభ్యులుగా ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం, రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్ – FAC) ఎస్. సురేష్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. తదుపరి కార్యాచరణ చేపట్టాలని విజయవాడలోని APSFTVTDC ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రతిష్టాత్మక ‘నంది అవార్డుల’ పునరుద్ధరణపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సినీ, టెలివిజన్, నాటక రంగాల కళాకారుల ప్రతిభకు కొలమానంగా నిలిచిన నంది పురస్కారాలు, రాష్ట్ర విభజన అనంతరం నిలిచిపోయాయి. గతేడాది తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ అవార్డ్స్’ పేరిట పురస్కారాలను అందజేయడంతో, ఏపీలో నంది అవార్డుల ప్రదానంపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో, ఏపీఎఫ్డీసీ (APFDC) చైర్మన్ భరత్ భూషణ్ అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు.
తాజాగా గురువారం (నవంబర్ 26) విడుదలైన ఉత్తర్వుల ప్రకారం, 2017 నుండి 2025 వరకు సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు వేర్వేరు జ్యూరీ కమిటీలను ప్రభుత్వం నియమించింది. వచ్చే నెల (డిసెంబర్)లో విజయవాడ లేదా అమరావతి వేదికగా ఈ నంది పురస్కార ప్రదానోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇక అవార్డుల విభాగాలపై ఏపీఎఫ్డీసీ చైర్మన్ భరత్ భూషణ్ స్పష్టతనిచ్చారు. 2017 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న ఏడేళ్ల కాలానికి అన్ని కేటగిరీల్లో అవార్డులు ఇవ్వడం ఆచరణ సాధ్యం కానందున, ప్రతి ఏడాదికి మొదటి, రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌లతో పాటు రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను మాత్రమే అందజేయనున్నారు. అయితే, 2025వ సంవత్సరం నుండి మాత్రం పాత పద్ధతిలోనే అన్ని విభాగాల్లోనూ పూర్తిస్థాయిలో నంది అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలో గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు సైతం నంది పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది.

