Last Updated:
Samajwadi Party manifesto 2027: 2027లో జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఇప్పుడే సమరశంఖం పూరించింది.
యువత, రైతులు, మహిళలు మరియు వెనుకబడిన వర్గాలను (PDA) ఆకట్టుకునేలా భారీ హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం లఖ్‌నవూలో విడుదల చేశారు. ‘సత్తాయీస్ కా సంకల్ప్ – పీడీఏ కా ప్రణ్‌పత్ర్’ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేతలు ఆజం ఖాన్, అవధేశ్ ప్రసాద్ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. తమ పార్టీని గెలిపిస్తే ఐదేళ్లలో 25 లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.5 వేల భృతి ఇస్తామని అఖిలేశ్ ప్రకటించారు.
ఈ మ్యానిఫెస్టోలో యువతకు, విద్యార్థులకు పెద్దపీట వేశారు. ఉద్యోగం లేదా ఉపాధి లభించే వరకు పట్టభద్రులకు ప్రతినెలా రూ.5 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, పేపర్ లీకేజీలు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇతర రంగాల్లో మరో 2 నుండి 3 కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, 12వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఉచిత లాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
రైతు సంక్షేమం: అధికారంలోకి రాగానే తక్షణమే రైతు రుణమాఫీ చేస్తామని, 23 పంటలతో పాటు పాలకు కూడా కనీస మద్దతు ధర (MSP) కల్పిస్తూ చట్టబద్ధత తెస్తామని హామీ ఇచ్చారు. చెరకు రైతులకు 24 గంటల్లోనే బకాయిల చెల్లింపులు జరిగేలా రూ.15 వేల కోట్లతో ప్రత్యేక కార్పస్ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
మహిళలు, పేదల కోసం: వృద్ధ మహిళలు, శ్రామికులకు ఏటా రూ.40,000 చొప్పున పింఛన్ అందిస్తామని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, పేదలు మరియు మహిళల కోసం ‘సమాజ్‌వాదీ క్యాంటీన్ల’ ద్వారా రూ.5కే భోజనం అందిస్తామని పేర్కొన్నారు.
ఉద్యోగులు, సామాజిక న్యాయం: ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరిస్తామని, పొరుగు సేవల (ఔట్‌సోర్సింగ్) విధానానికి స్వస్తి పలుకుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టడంతో పాటు, రూ.50 కోట్ల వరకు విలువైన ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళితులు, మైనారిటీలు, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు.
గ్రామీణాభివృద్ధి: గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని, గ్రామీణ గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ మాట్లాడుతూ.. జైళ్లలో ఉండే కష్టాలు, ఖైదీల మానసిక పరిస్థితుల గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు అఖిలేశ్ యాదవ్ కూడా కనీసం ఆరు నెలలు కారాగారవాసం చేసి ఉంటే బాగుండేదని తాను అప్పుడప్పుడూ అనుకుంటూ ఉండేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

