Last Updated:
‘రామాయణం’ (పార్ట్-1) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరి రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందో చూద్దామా..
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం’ (పార్ట్-1) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కేజీఎఫ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటించిన ఈ విజువల్ వండర్ పై ఇప్పటికే దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఫస్ట్ షో నుంచే పాజిటివ్ స్పందన రావడంతో తొలి రోజు ఇండియాలో రూ. 64.85 కోట్ల నికర (Net) వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే రెండో రోజు రూ.57.30కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. రెండు రోజుల్లో కలిపి ఓవర్సీస్లో రూ.86.25కోట్లు, ఇండియా గ్రాస్ రూ.134.80కోట్ల గ్రాస్, రూ.112.90కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ చూస్తే ఈ చిత్రం రూ.221కోట్లు రాబట్టింది.
హిందీ బెల్ట్ లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన రాగా, దక్షిణాదిలో కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘రావణాసురుడి’ పాత్రలో నటించినప్పటికీ కన్నడ నాట కూడా రామాయణ నత్త నడకే నడుస్తోంది. ఇక తెలుగులో రణ్బీర్, సాయి పల్లవిల నటనకు ప్రశంసలు దక్కుతుండటంతో మంచి వసూళ్లు వస్తుండగా, తమిళ, మలయాళ భాషల్లో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది. అయితే ఇప్పుడు వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ శని, ఆది వారాల్లో రామాయణ కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

