Last Updated:
ఫిలిప్పీన్స్ ఎయిర్ బేస్ వద్ద శిక్షణ సమయంలో రెండు సైనిక విమానాలు గాల్లోనే ఢీకొని కుప్పకూలాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోగా, ఆ విమానాల రాకపోకలను ఆర్మీ నిలిపివేసింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఫెర్నాండో ఎయిర్ బేస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సైనిక శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన రెండు ఎస్‌ఎఫ్-260 (SF-260) రకం తేలికపాటి శిక్షణ విమానాలు ప్రమాదవశాత్తు పరస్పరం అతి సమీపంలోకి వచ్చి గగనతలంలోనే బలంగా ఢీకొన్నాయి. తీవ్రమైన తాకిడితో నియంత్రణ కోల్పోయిన రెండు విమానాలు గింగిరాలు తిరుగుతూ నేరుగా ఎయిర్ బేస్ ఆవరణలోనే కుప్పకూలిపోయాయి.
ఈ విమాన ప్రమాదంలో రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న నలుగురు పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారని ఫిలిప్పీన్స్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ పైలట్లను కాపాడలేకపోయారు. విమానాలు గ్రౌండ్‌పై పడిన సమయంలో ఎలాంటి ఇతర ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.
ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి సైనిక దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కారణాలు తెలిసే వరకు ఎస్‌ఎఫ్-260 విమానాలన్నింటినీ తక్షణమే నిలిపివేస్తున్నట్లు (గ్రౌండెడ్) ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ఇటలీ తయారీకి చెందిన ఈ ప్రొపెల్లర్ శిక్షణ విమానాలను దశాబ్దాలుగా అక్కడి సైన్యం వాడుతోంది. 2017లో మరావీ నగరంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై జరిపిన వైమానిక దాడుల్లోనూ వీటిని వినియోగించారు.
Philippine Air Force planes FLY DANGEROUSLY CLOSE before COLLIDING MID-AIR — BOTH SPIRAL OUT OF CONTROL & CRASH during TRAINING
4 AIR FORCE PILOTS KILLED https://t.co/fgqEdxJNM3— RT (@RT_com) October 24, 2026
ఫిలిప్పీన్స్ వాయుసేనలో ఇలాంటి విషాదం జరగడం మొదటిసారేమీ కాదు. గతంలో మే నెలలో ఉత్తర ప్రాంత పర్వతాల్లో ఒక ఎస్‌ఎఫ్-260 కూలి ఇద్దరు పైలట్లు మరణించారు. అలాగే 2023లో జరిగిన మరో శిక్షణ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనతో సైనిక విమానాల సాంకేతిక నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

